Sunday, April 28, 2024

కంభంపాటి, దత్తన్నలకు జనసేనాని అభినందనలు

గవర్నర్లకు నియామితులైన ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, బండారు దత్తాత్రేయలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. కంభంపాటి హరిబాబు మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావడం సంతోషకరమైన విషయమని పవన్ కల్యాణ్ అన్నారు. హరిబాబుకి జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విద్య, వైద్యం, స్కిల్ డెవలప్మెంట్ రంగాలపై దృష్టిపెట్టారని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం అభివృద్ధిలో హరిబాబు అనుభవం ఎంతో దోహదపడుతుందనే విశ్వాసం ఉందన్నారు. 

హరియాణా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయకి  జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హరియాణా రాష్ట్ర అభివృద్ధిలో బండారు దత్తాత్రేయ తన వంతు పాత్రను ఆయన పోషిస్తారనే నమ్మకం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

దేశంలో 8 రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించిన సంగతి తెలిసిందే. ఈ ఎనిమిది మందిలో న‌లుగురు కొత్త వారు కాగా, మిగిలిన న‌లుగురు బ‌దిలీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌కు స్థాన చ‌ల‌నం క‌లుగ‌గా, ఏపీ బీజేపీ నేత కంభంపాటి హ‌రిబాబును గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌రించింది. మిజోరం గ‌వ‌ర్న‌ర్ గా కంభంపాటి హ‌రిబాబును కేంద్రం నియమించింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న బండారు ద‌త్తాత్రేయను హ‌ర్యానాకు బ‌దిలీ అయ్యారు. మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై గోవా గ‌వ‌ర్న‌ర్‌గా, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న స‌త్య‌దేవ్ నారాయ‌ణ్ త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా, త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న ర‌మేశ్ బైస్ జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియామ‌కం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement