Monday, April 29, 2024

AP | సంక్రాంతి బరులకు సిద్ధమవుతున్న పందెం కోళ్ళు.. లక్షలు పలుకుతున్న పుంజులు

అమరావతి, ఆంధ్రప్రభ : సంక్రాంతి వచ్చేస్తోంది. సరిగ్గా మరో రెండు నెలల్లో ఉూరంతా పండుగ ముస్తాబుకు సిద్ధమవుతోంది. అయితే సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు.. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న కోడి పందాలకు ఇప్పటి నుంచే బరులు సిద్ధమవుతున్నాయి. ఈ బరుల్లో కాలు దువ్వేందుకు కోళ్ళు కూడా రెఢీ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ, విదేశాల నుంచి తరలివచ్చే ఎంతో మంది సంక్రాంతి కోడి పందాలపై ఆసక్తి చూపేవారే. ముఖ్యంగా గోదావరి జిల్లాలో భారీ ఎత్తున ఈ కోడిపందాలు జరుగుతాయి. పందాల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారతాయి.

కోడి పందాల నిర్వహణకు ప్రభుత్వం, కోర్టు నిబంధనలు ఓ వైపు.. పోలీసు దాడులు, కేసులు మరోవైపు అయినా కోడి పందాల నిర్వహకులు మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తారు. మరి అం తటి ప్రాముఖ్యత కలిగిన పందాల బరిలో నిలిచి సై అనాల్సింది మాత్రం కోళ్ళే. లక్షలు, కోట్ల రూపాయల పందాలు వేసే యజమానులకు గెలుపు తెచ్చి పెట్టాల్సింది ఈ పందెం కోళ్ళే. అందుకే వీటికి అంత డిమాండు.. ఖరీదు. లక్షల రూపాయలు విలువ చేసే పందెం కోళ్ళ పెంపకానికి కృష్ణా, గోదావరి జిల్లాలు ప్రసిద్ధి. సంక్రాంతి బరుల్లో నిలిపేందుకు రెండు నెలల ముందు నుంచే సిద్ధం చేస్తున్న పందెం కోళ్ళకు ఇప్పుడు మంచి గిరాకీ పలుకుతోంది.

జాతి పందెంకోడి తయారీకి సుమారు రూ. 25 నుంచి 50వేల వరకు వరకు ఖర్చు అవుతుంది. అలా తయారు చేసిన కోడిపుంజులను వాటి రంగు, ఎత్తు, బలం, పటిష్టత పరిగణనలోకి తీసుకుని సుమారు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకు రేటు నిర్ణయించి విక్రయిస్తారు. అందుకే సంక్రాంతి ముగిసి మళ్ళీ వచ్చే సంక్రాంతికి పందెం కోళ్ళను సిద్ధం చేసేందుకు ఏడాది పాటు పెంపకందారులు శ్రమించాల్సి ఉంటుంది. ఒకరకంగా వీరికి ఇదే జీవనాధారం కూడా. విశాలమైన ప్రదేశంలో ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి కోళ్ళ పెంపకానికి అనువైన వాతావరణ పరిస్ధితులు కల్పించాలి.

- Advertisement -

జాతి కోళ్ళ నుంచి సేకరించిన గుడ్లను పొదిగించి పిల్లలను చేసి బలమైన పోషకాహారంతో పెంచి పోషించాలి. అయితే విదేశీ జాతి కోళ్ళకు మంచి డిమాండు ఉంది. అందుకే దేశీయ జాతులతోపాటు విదేశీ జాతి కోళ్ళను కూడా పెంపకందారులు గత ఏడాదిగా పెంచి పొషిస్తూ బరులకు సిద్ధం చేస్తున్నారు. అయితే రెండు మాసాల ముందు నుంచే ఈ పందెం కోళ్ళకు బేరాలు ప్రారంభంకావడంతో క్రయ, విక్రయాలు ఉూపందుకుంటున్నాయి. బలమైన ఆహారంతోపాటు పోరాటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి బరులకు సిద్ధం చేస్తున్న కోళ్ళకు ఏ వ్యాధులు సోకకుండా ఉండేందుకు నిరంతరం వైద్యుని పర్యవేక్షణ ఉంచడం గమనార్హం.

పందెం కోళ్ళపై దొంగల కన్ను..

ఏడాది శ్రమించి పెంచి, సరిగ్గా సంక్రాంతికి రెండు నెలల నుంచి లక్షల్లో గిరాకీకి సిద్ధం చేస్తున్న ఈ ఖరీదైన పందెం కోళ్ళపై దొంగల కన్ను పడింది. గత కొద్దిరోజులుగా గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పందెం కోళ్ళ పెంపకం దారులకు దొంగల బెడద పట్టుకుంది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న కోడిపుంజులను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళుతున్నారు. సీజన్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఈ కోళ్ళ దొంగతనాలు జోరందుకుంటున్నాయి. వీటిని దొంగిలించి అమ్ముకుని లక్షలు చేసుకుంటున్నారు. దొంగలు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు ఖరీదైన జాతి కోడిపుంజులను పెంచుతున్నారు.

శిక్షణ పొందిన కోళ్ళు కావడంతో వీటిపై దొంగల కన్ను పడింది. కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలను క త్తులతో బెదిరించిన దుండగులు సుమారు రూ.4 లక్షల విలువైన 11 జాతి పుంజులను అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. అయితే సీజన్‌ దగ్గరపడుతున్నందున ఖరీదైన కోళ్ళ పెంపకందారులు రక్షణ ఏర్పాటు చేసుకోవాలని ఇందుకోసం ప్రత్యేకంగా సీసీ కె మేరాలు పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

కోడి పందాలపై దాడులు..

దిలావుండగా సంక్రాంతి సమీపిస్తున్నందున మరోవైపు కోడి పందాలు ఉూపందుకుంటున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడిక్కడ దాడులు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం, బావిరంగన్న చెరువు గుట్ట వద్ద కోడి పందాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 25 మందిని అరెస్ట్‌ చేసి రూ. 1,13,300 లక్షలు నగదు, పందెం కోళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏలూరు, గోదావరి జిల్లాల పరిధిలో ఇప్పటికే పోలీసులు కోడి పందాలపై దాడులు కొనసాగిస్తున్నారు. నిర్వహకులపై ప్రత్యేక నిఘా ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement