Tuesday, May 7, 2024

Palamaneru – ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

పలమనేరు ( రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠా సభ్యులను చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు ఈరోజు అరెస్టు చేసారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జిల్లా ఎస్ పి రిశాంత్ రెడ్డి వివరించారు. ఆ వివరాల ప్రకారం జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, కుప్పం సర్కిళ్ల పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించి డి.ఎస్.పి. ఎన్.సుధాకర్ రెడ్డి పోలీసులతో 4 బృందాలు ఏర్పాటు చేసారు. ఆ బృందం కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి చేపట్టిన విచారణలో జరిగిన దొంగతనాల వెనుక ఉన్న ముఠా ఆచూకి దొరికింది. ఆయా రాష్ట్రాలలో పలు ఇళ్ల దొంగతనాలతో పాటు బ్యాంకు దొంగతనాలకు కూడా పాల్పడిన రమేష్ ముఠా హస్తం ఉన్నట్టు తేలింది. ఆపై కొనసాగించిన దర్యాప్తు లో భాగంగా ముందుగా తెలిసిన సమాచారం మేరకు పుంగనూరు ఎస్.ఐ సుకుమార్ ఈరోజు పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్ దగ్గర రమేష్ తో పాటు ముఠా సభ్యులైన గోవిందరాజు, శ్రీనివాసులను, గవియప్ప, గణేష్, అశ్వత్ నారాయణ లను అరెస్ట్ చేసారు

.వారి వద్ద నుంచి రెండు కార్లతోపాటు సుమారు రూ 30 లక్షలు విలువైన 520 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని తాళాలు పగలుకొట్టి ఇళ్ళల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడేవారని, తరువాత బంగారాన్ని రమేష్, శ్రీనివాసులు వారి వారి బందువులకు ఇచ్చి ముత్తుట్ ఫైనాన్సు, అట్టిక గోల్డ్ కంపెనీలలో అమ్మేసి సొమ్ము చేసుకునేవారని తెలిసినట్టు రిశాంత్ రెడ్డి తెలిపారు. వీరిపై పలు రాష్ట్రాలలో వందకు పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. ముఠాని ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసిన పలమనేరు సబ్-డివిజన్ పోలీసులను ఆయన క్యాష్ రివార్డ్, సర్టిఫికెట్స్ తో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement