Sunday, April 28, 2024

AP | ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల ఫలితాలు విడుదల.. 27 నుండి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌

అమరావతి,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ప్లబిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ డా.కె.వి.శ్రీనివాసులు రెడ్డి ప్రకటనలో తెలిపారు. జూన్‌ 26 నుండి జులై 4 వరకు నిర్వహించిన ఈ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను www.apopenschool.ap.gov.in వెబ్‌ సైటులో పొందుపరిచామని, విద్యార్థులు ఈ వెబ్‌సైటు నుండి మార్కుల మెమోలు డౌన్లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

పదో తరగతి పరీక్షలకు 13,320 మంది విద్యార్థులు హాజరు కాగా 7,619 మంది (57.20శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు 25,097 మంది హాజరుకాగా 15,676 మంది (62.46శాతం) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పదో తరగతిలో బాలికల ఉత్తీర్ణత శాతం 52.60 కాగా, బాలురు 41.75 శాతం సాధించారని, ఇంటర్మీడియెట్లో బాలికలు 65.32 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా, బాలురు 60.92 శాతం రెండో స్థానంలో నిలిచారని తెలిపారు.

- Advertisement -

పదో తరగతిలో 88.19శాతంతో కాకినాడ జిల్లా ముందంజలో ఉండగా, 16.83శాతంతో ఎన్టీఆర్‌ జిల్లా చివరిస్థానంలో ఉంది. ఇంటర్మీడియెట్లో 84.68శాతంతో తూర్పు గోదావరి ముందంజలో ఉండగా, 41.71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి అత్యల్పంగా నిలిచింది. జూలై 27 నుండి ఆగస్టు 4వ తేదీవరకు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కు సంబంధించిన ఫీజుల చెల్లించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన రుసుము ఏపీ ఆన్‌ లైన్లో చెల్లించవచ్చని, ప్రత్యేకమైన అభ్యర్థనలు పంపనవసరం లేదని ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ- డైరెక్టర్‌ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement