Monday, May 6, 2024

ఒక‌టి ఒక‌టి ఒక‌టి అంటే వాచిపోద్ది, టెన్త్ రిజ‌ల్ట్‌ ప్ర‌చారంపై నిషేధం.. లక్ష జరిమానా, ఏడేళ్ల దాకా జైలు

అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక ఏ విద్యాసంస్థలు కూడా వాటి గురించి ప్రచారం చేసుకోవడం, ప్రకటనలు చేయడం నిషిద్ధమని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేస్తోందన్నారు. పది పరీక్షల ఫలితాల విడుదలలో గతంలో గ్రేడింగ్‌ విధానం ఉండేదని, 2020 మార్చి నుంచి మార్కులు ప్రకటించే విధానాన్ని పున:ప్రారంభించామని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి తమ విద్యాసంస్థలే కారణమని విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేదన్నారు. అలాంటి ప్రచారం వల్ల విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది.

దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫలితాలను తమకనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల చట్టం 7ఏ ప్రకారం వీలు లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ర్యాంకుల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ విద్యామండలి కూడా ఎలాంటి ప్రచారం చేసుకోకూడదనే ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఇప్పటి వరకు మూడేళ్లలోపు జైలు శిక్ష ఉండగా.. దానిని ఏడేళ్లకు పెంచడంతోపాటు, రూ. ఐదు వేలకు తక్కువ కాకుండా ఉన్న జరిమానాను రూ. లక్ష వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement