Thursday, May 2, 2024

Delhi | మిశ్రధాతు లోహంతో ఎన్టీఆర్ స్మారక నాణెం.. ఆన్‌లైన్ సహా హైదరాబాద్‌లో అమ్మకం!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నాలుగు ధాతువులతో కలిపి తయారు చేసిన నందమూరి తారక రామారావు స్మారక నాణెం నేటి నుంచి హైదరాబాద్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్‌తో పాటు చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియంలలో అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మింట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక వ్యక్తి పేరిట స్మారక నాణేన్ని తయారు చేశామని ఆయన చెప్పారు.

సాధారణంగా వ్యక్తుల పేరిట స్మారక నాణేలను ముంబై మింట్ లేదా మరెక్కడైనా తయారు చేస్తారని, తాము ఇది వరకు టైగర్ ప్రాజెక్ట్ సందర్భంగా పులి బొమ్మతో స్మారక నాణేన్ని తయారు చేసినట్టు చెప్పారు. భారతీయ సినిమా, రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసిన ఎన్టీ రామారావు బొమ్మతో స్మారక నాణెం తయారు చేయాలని తమకు ఆర్థిక శాఖ నుంచి ఆదేశాలు రాగానే తామంతా ఒక బృందంగా ఏర్పడి పనిచేశామని చెప్పారు. నాణెం డిజైన్‌ రూపకల్పన తమ ఉద్యోగి నాగశైల రెడ్డి చేశారని, 2డీ డిజైన్‌ను ఆర్థిక శాఖకు పంపి, ఆమోదం తెలపగానే ప్రింటింగ్ చేపట్టామని వెల్లడించారు.

ఈ నాణెం కోసం నాలుగు ధాతువులు (50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్) కలిపి తయారైన క్వాడ్రినరీ అల్లాయ్‌తో రూపొందించామని వెల్లడించారు. ఈ నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో అంతే ఖర్చుతో విక్రయానికి ఉంచామని అన్నారు. రూ. 3,050 నుంచి గరిష్టంగా రూ. 4,850 వరకు నాణెం ధర ఉంటుందని, ప్యాకింగ్ మెటీరియల్‌ను బట్టి ధర మారుతుంది తప్ప అన్నింటిలోనూ ఉండేది ఒకే నాణెం అని వెల్లడించారు. స్మారక నాణెం కాబట్టి మార్కెట్లో చలామణిలో ఉండదని, ఆ మహానుభావుడి గుర్తుగా ఈ నాణేన్ని తమ దగ్గర దాచుకుంటారని చెప్పారు. కాలం గడిచే కొద్దీ పురాతత్వ విలువ జోడై ఈ నాణెం విలువ అమాంతం పెరిగిపోతుందని అన్నారు.

- Advertisement -

సాధారణంగా స్మారక నాణేల తయారీ కోసం కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రతిపాదిస్తే ఆర్థిక శాఖ ఆమోదిస్తుందని, కానీ ఎన్టీఆర్ స్మారక నాణెం విషయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటూ కేంద్ర ఆర్థిక శాఖ నేరుగా తయారీకి ఆదేశాలు జారీ చేసిందని వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారి స్మారకార్థం ఈ తరహాలో స్మారక నాణేలను తయారు చేస్తుంటామని, అయితే హైదరాబాద్ మింట్‌లో తొలిసారిగా ఒక వ్యక్తి పేరిట స్మారక నాణెం తయారవగా.. అది ఎన్టీఆర్‌ది కావడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

తొలి విడతలో 12,000 నాణేలను ముద్రించామని, కానీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఇప్పటికే మెయిల్ ద్వారా, ఫోన్ల ద్వారా తమకు ఈ నాణెం కావాలని కోరుతున్నారని చెప్పారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కోరుకున్న అందరికీ అందేలా నాణేలను ముద్రించి ఇస్తామని తెలిపారు. తొలి ప్రయత్నంలో దొరకలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని వీఎన్ఆర్ నాయుడు భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement