Thursday, May 2, 2024

ఇంపార్టెన్స్​ మేరకు ఎన్​హెచ్​ విస్తరణ పనులు – ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజా అవసరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జాతీయ రహదారుల విస్తరణ ప్రాతినిధ్యాలను పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై రాజ్యసభలో బుధవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖా మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. పిడుగురాళ్ల నుంచి ఓడరేవు మరియు కొండమోడు నుంచి పేరేచర్ల వరకు డీపీఆర్ తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సేవల బిడ్లు తుది దశలో ఉన్నాయని వెల్లడించింది. మాచర్ల నుంచి దాచేపల్లి వరకు హైవే స్ట్రెచ్ కోసం, డీపీఆర్ తయారీకి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సేవలను కాంట్రాక్ట్ చేయడానికి టెండర్ ఆధారిత అంచనా మంజూరు దశలో ఉందని, కన్సల్టెన్సీ సేవల అవార్డు అనంతరం డీపీఆర్‌ తయారవుతుందని తెలిపింది.

జాతీయ రహదారి 544డీ కింద వినుకొండ నుంచి గుంటూరు వరకు 4-లేనింగ్ కోసం డీపీఆర్ పురోగతిలో ఉందని, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని మంత్రిత్వ శాఖ వివరించింది. జాతీయ రహదారి 565లోని నాగార్జున సాగర్ నుంచి దావులపల్లి సెక్షన్ కోసం స్వీకరించిన బిడ్‌లు కాంట్రాక్ట్ అవార్డ్ కోసం మదింపులో ఉన్నాయని, మాచర్ల నుంచి ఎర్రగొండపాలెం హైవే స్ట్రెచ్ ఇందులో భాగమేనని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర పీడబ్ల్యుడీ శాఖ ద్వారా నిర్మాణమవుతున్న పిడుగురాళ్ల బైపాస్‌ రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వ జాప్యమే కారణమని బదులిచ్చింది. చిలకలూరిపేట బైపాస్ ప్రాజెక్టు కూడా మరో రెండేళ్లలో పట్టాలెక్కుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అవసరాల ఆధారంగా కొత్త జాతీయ రహదారి విస్తరణ ప్రాతనిధ్యాలను పరిశీలిస్తామని నరసరావుపేట-పల్నాడు రీజియన్‌లో కొత్త హైవే స్ట్రెచ్‌ల నిర్మాణం గురించి కేంద్రం వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement