Monday, May 20, 2024

ఉగాదికి కొత్త టీం: మంత్రివర్గ మార్పునకు సంకేతాలు.. కేబినెట్‌లో స్పష్టంచేసిన సీఎం జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రివర్గంలో మార్పులకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గత మూడు నెలలుగా మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా శుక్రవారం బడ్జెట్‌ ఆమోదం కోసం మంత్రివర్గం సమావేశమైంది. కీలకమైన ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడంతోపాటు త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు ఉండబోతున్నాయన్న సంకేతాన్ని సీఎం జగన్‌ సహచర మంత్రులకు పంపారు. అయితే, సీఎం జగన్‌ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 2వ తేదీ మంత్రివర్గంలో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల్లోనూ ఉగాది నాడే మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం కూడా మొదలైంది. అయితే, సీఎం జగన్‌ మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులకు గత కేబినెట్‌లో ఎన్నడూ లేని విధంగా కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ మార్పుల్లో భాగంగా పదవులు పోయినవారు బాధపడాల్సిన అవసరం లేదని, అటువంటివారికంతా జిల్లా పార్టీ పగ్గాలు అప్పగిస్తామని కొత్త మంత్రులతో తాజామాజీ మంత్రులు కలిసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. మళ్లీ మనమే అధికారంలోకివస్తామని, అప్పుడు కచ్చితంగా వీరి సేవలను గుర్తించి మరోమారు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని ..ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సీఎం అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రుల్లో ఆందోళన మొదలైంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో ఆనందం అవధుల్లేకుండా పోయింది. ఉగాది ఎప్పుడొస్తుందా.. తమ కల ఎప్పుడు సాకారం అవుతుందా..అన్న ఆనందంతో మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్‌ శాసనసభ్యులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మంత్రివర్గంలో భారీ మార్పులు..
ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం జగన్‌తో కలిసి 25 మంది మంత్రులున్నారు. వారిలో నలుగురు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. 2019 జూన్‌ 8వ తేదీ మంత్రి వర్గం ఏర్పాటైంది. ఆ సమయంలోనే ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకుంటున్న వారి కి రెండున్నర సంవత్సరాల వరకే అవకాశమని ఆ తర్వాత కొత్త వారిని కేబినెట్‌లోకి తీసుకుంటామని సీఎం జగన్‌ అప్పుడే ప్రకటన చేశారు. వాస్తవానికి గత ఏడాది నవంబర్‌ నాటికే ముప్పై నెలలు పూర్తి అయింది. అయితే ఆ సమయంలోనే మంత్రివర్గ మార్పులపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. త్వరలో మంత్రివర్గ విస్తరణకు కొత్త పేర్లు తెరపైకి కూడా వచ్చాయి. అయితే కోవిడ్‌ నేపథ్యంలో ఏడాదిన్నరకాలం పాటు మంత్రులు పూర్తి సమయం ప్రజా సేవచేసే అవకాశం కోల్పోయారని మరో ఆరు నెలల పాటు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పట్లో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్‌ పడినట్లు అయింది. తాజాగా శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో స్వయంగా సీఎం జగన్‌ మార్పులపై సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. ఉగాదిని పురస్కరించుకుని మంత్రివర్గ మార్పులకు శ్రీకారం చుడుతున్న సీఎం జగన్‌ పూర్తిగా తన కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకోవాలా? కొంత మంది సీనియర్లను కొనసాగిస్తూ వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను మాత్రమే తొలగించాలా..అనే అంశంపై సీఎం జగన్‌ లోతుగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద కొంత మంది సీనియర్లను మాత్రం తన కేబినెట్‌లో కొనసాగిస్తూ 70 శాతం వరకూ కొత్తవారికి అవకాశం కల్పించేలా కేబినెట్‌లో భారీ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

వైయస్సార్‌ ఎల్పీ భేటీలో స్పష్టత :
బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి భారీగా నిధులు కేటాయించడంతోపాటు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికోసం ఏడాదికి రూ. 2 కోట్లను కేటాయించడాన్ని బట్టి చూస్తుంటే సీఎం జగన్‌ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నట్లు స్పష్టంగా అర్ధమౌతోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో జరగనున్న వైయస్సార్‌ ఎల్పీ సమావేశంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం జగన్‌ పూర్తి స్పష్టత ఇస్తారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శాసనసభ్యుల్లోనూ ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. గడచిన 33 నెలల కాలంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారి ఆధ్వర్యంలో ఆయా శాఖల పరిధిలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను శాసనసభ్యులకు వివరించడంతోపాటు ఉగాది తరువాత ప్రజల్లోకి వెళ్లే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మంత్రివర్గ మార్పులకు సంబంధించి ఇదే సభ వేదికగా ఆయన అధికారికంగా ప్రకటన కూడా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement