Monday, April 29, 2024

Meruga: ఏపీ చరిత్రలో నూతన శకం : మంత్రి మేరుగ

విజయవాడ: ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, సామాజిక సమతుల్యత విరాజిల్లుతుందనడానికి నిదర్శనమే ఈ అంబేద్కర్ విగ్రహం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్వరాజ్యమైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను సోమవారం.. మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ… సుమారు రూ. 420 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ భావించారన్నారు.

త్వరితగతిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సీఎం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవమవుతుందని మంత్రి మేరుగ తెలిపారు. చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అంబేద్కర్ పేరు ఉచ్ఛరించడానికి లోకేష్‌, చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు. ఐదేళ్లలో పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి మేరుగ దుయ్యబట్టారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడూతూ.. భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుందన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement