Monday, April 29, 2024

దిక్కున్న చోట చెప్పుకో.. ఎక్కడికైనా వెళ్లి చావు.. త‌ల్లిని గెంటేసిన కొడుకు

కోవూరు : కని పెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుంచి రోడ్డు పైకి గెంటివేసిన హృదయ విదారక ఘటన కోవూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే స్థానిక బజార్ రోడ్ లో నివాసం వుండే గడ్డం వెంకట రత్నమ్మ (75) అనే వృదురాలు తన భర్త గడ్డం ఆంజనేయులు మృతిచెందాక కుమారుడు గడ్డం సుబ్బారావు వద్ద వుంటుండేది. ఈ క్రమంలో తన తల్లిని ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందిగా సుబ్బారావు తరచూ ఒత్తిడి చేసేవాడు. దీంతో వెంకట రత్నమ్మ తన కూతురు ఇంటికి వెళ్లి అక్కడ తలదాచుకోసాగింది. తాను తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నానని, వైద్య ఖర్చులకైనా ఎంతో కొంత డబ్బులు నెల నెలా ఇవ్వమని కొడుకు వద్ద ప్రాధేయ పడింది. దీంతో చిర్రెత్తిన సుబ్బారావు ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు నీకు దిక్కున్న చోట చెప్పుకో… ఎక్కడికైనా వెళ్లి చావు అంటూ ఇంటి నుంచి రోడ్డుపైకి ఈడ్చేసాడు. అంతటితో ఆగక సభ్య సమాజం తల దించుకొనేలా సుబ్బారావు దంపతులు బూతు పంచాంగం మొదలెట్టారు. అసలే వేసవి కాలం.. అదీ మిట్ట మధ్యాహ్నం.. తీవ్రమైన ఎండలో ఆ తల్లి రోడ్డుపై అలా కూర్చొని రోధించ‌డం చూసిన పలువురి కళ్ళు చెమ్మగిల్లాయి.

ఇంతకు మునుపు కొడుకు కోడలు ఇదే విధంగా ప్రవర్తించినప్పుడు జిల్లా ఎస్పీ విజయా రావు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వెంకట రత్నమ్మ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయమని కోవూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఎస్పీ నాడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో కోవూరు పోలీస్ లు గడ్డం సుబ్బారావు దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఐపీసీ 506, 509తో పాటు సెక్షన్ 24 క్రింద కేసు నమోదు చేశారు. పోలీస్ ల చొరవతో ఇంటికి చేరుకున్న వెంకట రత్నమ్మపై సుబ్బారావు దంపతులు మరోసారి దాడి చేసి రోడ్డు పైకి నెట్టి వేశారు. ఈ సందర్భంగా వెంకట రత్నమ్మను కలిసిన ఆంధ్రప్రభ ప్రతినిధితో గోడు వెళ్లబోసుకున్నారు. తన భర్త గడ్డం ఆంజనేయులు తాను కష్టపడి వ్యాపారాలు నిర్వహించామని రూపాయి రూపాయి కూడబెట్టి కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించామని తెలిపారు. తన భర్త గడ్డం ఆంజనేయులు గత సంవత్సరం కరోనాతో చనిపోయారని తెలిపారు. అప్పటి నుంచి తన కొడుకు కోడలు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కడుపులో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ నేడు వేళకు ఇంత ముద్ద పెట్టేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాడంటూ వాపోయారు. తన భర్త సంపాదించిన ఆస్తులను అనుభవిస్తున్న కుమారుడు తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడని పదే పదే ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. తన జీవనభృతికి ఎంతో కొంత సహాయం చేయమని కోరితే దాడులు చేస్తున్నారన్నారు. ఏది ఏమైనప్పటికీ అనార్యోగంతో బాధపడుతున్న పండు ముదుసలిని ఇంటి నుంచి గెంటి వేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పుతున్న వైనం విచారకరమని, కలికాలం పోకడలని పలువురు వాఖ్యానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement