Saturday, May 4, 2024

హైదరాబాద్ తప్పిపోయి గుజరాత్ లో ప్రత్యక్షం… 21 ఏళ్ల నిరీక్షణకు తెర

ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 21 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మహిళను తల్లిందండ్రుల చెంతకు చర్చారు కర్నూలు జిల్లా పోలీసులు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా  దేవమడ గ్రామంలో గత 10 ఏళ్లుగా నివశిస్తున్న కట్ట నాగశెట్టి.. గతంలో తెలంగాణలోని అలంపూర్ గ్రామంలో నివసించేవారు. నాగశెట్టి 5 వ సంతానం అయిన కట్ట శ్రీదేవి తనకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు హైదరాబాద్ లో తన అక్క శ్యామల దగ్గరికి వెళ్ళి  2001 సంవత్సరం మార్చి నెలలో రైల్వేస్టేషన్ లో తప్పిపోయింది. తప్పిపోయిన ఆమె కొరకు తల్లిదండ్రులు, అక్క శ్యామల, బావ నాగరాజులు  రైల్వేస్టేషన్ లో వెతికిన ప్రయోజనం లేకపోయింది. దీంతో హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆమె ఆచూకీ లభించలేదు. ఇలా 21 ఏళ్లు గడిచిపోయాయి. అయితే వారం రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రం వడోదరలోని పారుల్ సేవాశ్రమ్ వైద్య శాల నుండి కర్నూలు జిల్లా ఎస్పీకి ఫోన్ వచ్చింది. తన పేరు శ్రీదేవి అని, అలంపూరు కర్నూలు జిల్లా పేర్లు మాత్రమే తెలుపుతూ శ్రీదేవి తన ఫోటోను ఎస్పికి పంపుతూ  సమాచారం ఇచ్చింది. ఈ విషయమై దిశా, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తప్పిపోయిన శ్రీదేవి ఆచూకీ గురించి విచారించారు. గత 10 ఏళ్ల  క్రితం శ్రీదేవి తల్లి సత్యవతి మరణానంతరం కర్నూలు జిల్లా దేవమాడ గ్రామానికి మారి అక్కడే నివశిస్తున్నారని తెలిసి దేవమాడ గ్రామంలో విచారించగా ఆమె ఫోటోను చూసి అక్క శ్యామలమ్మ, ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న బావ నాగరాజు, తండ్రి నాగిశెట్టి ఆమెను గుర్తు పట్టారు. దీంతో శ్రీదేవిని కర్నూలుకు తీసుకురావడానికి చట్టపరమైన ఇబ్బందులకు కలుగకుండా కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ లో మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి ప్రత్యేకంగా ఒక పోలీసు వాహానాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ 1న గుజరాత్ కి వెళ్లారు. శ్రీదేవి అక్క శ్యామల, బావ నాగరాజులతో పాటు మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ జి.దానమ్మ ఇతర సిబ్బంది వెళ్లారు. గుజరాత్ లోని వడోదర లోని ఫారల్ సేవాశ్రమ్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్రీదేవి కలిశారు. తన అక్క, బావలను గుర్తుపట్టింది.

20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రైల్వేస్టేషన్ లో తప్పిపోయిన శ్రీదేవి హైదరాబాద్ నుండి రైల్ లో అహమ్మదాబాద్ చేరింది. అక్కడ అనాథగా తిరుగుతున్న ఆమెను వడదోరలో ఉన్న మథర్ థెరిస్సా ఛారిటీ సంస్థ చేరదీసింది. ఆమె కుటుంబ వివరాలు తెలుపలేక పొవడంతో  అక్కడ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పోలీసు ఉన్నతాధికారుల సమన్వయంతో సదరు శ్రీదేవిని వడోదరలోని పారుల్ సేవాశ్రమ్ నుండి కర్నూలు జిల్లా పోలీసులకు అప్పగించారు. గత 21 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుండి తప్పిపోయిన శ్రీదేవినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement