Monday, May 13, 2024

Pawan-Perni Nani : చెప్పుతో…. మక్కెలిరిగిపోతాయ్.. ప‌వ‌న్ కు పేర్ని నాని హెచ్చ‌రిక

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి పర్యటన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యల పట్ల పేర్ని నాని చెప్పులను చూపించారు. ఒక చెప్పు చూపిస్తేనే పెద్ద మొగోడినని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడని, తాను రెండు చెప్పులు చూపిస్తున్నానన్నారు. పవన్ కంటే పెద్ద మొగోడినంటూ నిప్పులు చెరిగారు. కత్తిపూడి సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రతి ఒక్క మాట అబద్ధమేనంటూ ధ్వజమెత్తారు. తన సినిమాలను అధికార పార్టీ అడ్డుకుంటోందంటూ పవన్ చేసిన ఆరోపణల్లో అర్థం లేదన్నారు. తాము అడ్డుకున్న ఒక్క సినిమా అయిన చూపించగలవా ? అంటూ సవాల్ విసిరారు. అబద్ధాలను ప్రచారం చేస్తే మక్కెలిరిగిపోతాయంటూ హెచ్చరించారు. వారాహి వాహనానికి నారాహి అని పెట్టుకోవాలంటూ పేర్ని నాని సూచించారు. దాన్ని లారీగా అభివర్ణించారాయన. ప్రభుత్వం తప్పు చేస్తే వదలనని చెప్పిన పవన్ కల్యాణ్ 2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కరోజయినా నిలదీశాడా ? అంటూ ప్రశ్నించారు. ఏనాడైనా చంద్రబాబు చొక్కా పట్టుకున్నాడా ? అంటూ ధ్వజమెత్తారు. 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని నడుపుతున్నది, పెంచి పోషిస్తోన్నదీ చంద్రబాబేనన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు రెండే రెండు విడుదలయ్యాయని, వాటిని తాము అడ్డుకున్నామా ? అని ఎదురు ప్రశ్న వేశారు. ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో సావాసం చేయడం ద్వారా పవన్ దిగజారిపోయాడని విమర్శించారు. ప్రజలను నమ్ముకుంటేనే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతావని, వ్యూహాలను నమ్ముకుంటే అసెంబ్లీ గేటు దాకా వెళ్లలేవని పేర్ని నాని హితబోధ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తన తల్లిని తిడితే అప్పుడు వాళ్లని తిట్టాడని, ఇప్పుడు వాళ్ల పంచనే చేరాడని ధ్వజమెత్తారు. కాపు సామాజిక వర్గంలో సానుభూతిని సంపాదించి, దాన్ని టీడీపీకి ఓట్లుగా మలచడానికే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నాడంటూ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులను పవన్ కల్యాణ్ విమర్శించినప్పటి వీడియోను ఈ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు పేర్ని నాని. పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడానికి టీడీపీకి తాను సహకరించానని, అయినా తన తల్లిని అవమానించారంటూ పవన్ కల్యాణ్ విమర్శించడం ఈ వీడియోలో రికార్డయింది. టీడీపీనీ తన జీవితంలో ఎప్పటికీ క్షమించనంటూ ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్- ఇప్పుడు ఆ పార్టీ నాయకుల పంచన చేరాడని సెటైర్లు వేశారు. టీడీపీ-బీజేపీ- పవన్ కల్యాణ్ ఈ ముగ్గురూ కలిసి 2014- 19లో ప్రభుత్వాన్ని నడిపినప్పుడు సినిమా టికెట్ల మీద జీఎస్టీ, వినోదపు పన్నులు లేవా? అని పేర్ని నాని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement