Monday, May 6, 2024

భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం.. 19న సీఎం భూమిపూజ

అమరావతి, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేస్తూ రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ ఆదివారం (16 ఏప్రిల్‌ 2023) ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టుకు భూసమీకరణ నిమిత్తం జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించిన రైతులతో సమావేశం నిర్వహించినప్పుడు గ్రామస్థులు పోర్టు సంబంధింత భూములన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోనే ఉన్నాయని, పోర్టు ప్రతిపాదిత ప్రాంతంలో భావనపాడు లేనందున పోర్టుకు మూలపేట పోర్టుగా పేరు పెట్టాలని కోరినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

పోర్టు నిర్మాణ ప్రాంతంలోని భూములు, నిర్వాసిత కుటుంబాలన్నీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల పరిధిలో ఉన్నందున గ్రామస్థుల కోరిక మేరకు భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వలవన్‌ తెలిపారు. గతంలో భావనపాడు పోర్టుగా నోటిఫై చేసిన ప్రాంతాన్ని ఇకపై మూలపేట పోర్టుగా పరిగణించాలని, సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మూలపేట పోర్టుకు ఏప్రిల్‌ 19వ తేదీన భూమిపూజ చేయనున్నారని పెట్టు-బడులు మరియు మౌలిక వసతుల (పోర్టులు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement