Monday, April 29, 2024

అశోక్ హయాంలో మాన్సాస్‌ ట్రస్ట్‌లో అక్రమాలు!

టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. అస్తవ్యస్త పాలనతో మాన్సాస్‌ విద్యా సంస్థలను భ్రష్టు పట్టించిన అసమర్ధడు అశోక్ గజపతి రాజు అని వ్యాఖ్యానించారు. ఏళ్ళ తరబడి తప్పుడు డేటా అప్‌లోడ్‌ చేసినందునే ప్రభుత్వం నుంచి మాన్సాస్‌కు ఆర్థిక సాయం అందలేదన్నారు.  చైర్మన్‌ పదవి అతనికి అలంకారం మాత్రమేనని బాధ్యత కాదన్నారు.

చైర్మన్‌గా అశోక్‌ ఏళ్ళ తరబడి మాన్సాస్‌ సిబ్బంది పని తీరును పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఫలితంగా విద్యార్ధుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. సమయానికి సంచయిత జోక్యం చేసుకుని వారికి డిగ్రీలు వచ్చేలా చేశారని తెలిపారు. లేకుంటే అశోక్‌ నిర్లక్ష్యానికి విద్యార్ధుల జీవితాలు బలైపోయేవి అని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు అశోక్ కనీసం లీగల్‌ హెడ్‌ను నియమించలేదని విమర్శించారు. ఒక కేసులో ట్రస్ట్‌ తరఫున వాదించే న్యాయవాది లేక కోర్టు ఏకపక్షంగా తీర్పు చెప్పిందన్నారు. ఫలితంగా ట్రస్ట్‌ 13 కోట్లు నష్టపోయిందని, ట్రస్ట్‌కు చెందిన భూముల్లో ఇసుక తవ్వకాలను కారుచౌకగా పచ్చ గ్యాంగ్‌కు కట్టబెట్టాఢని ఆరోపించారు.

అశోక్‌ హయాంలో మాన్సాస్‌ ట్రస్ట్‌కు వాటిల్లిన నష్టం అపారం అని అన్నారు. ఆ నష్టాన్ని ఇంకా అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారని చెప్పారు. ఇదే ఏ ప్రైవేట్‌ సంస్థలోనో జరిగితే తీవ్ర నిర్లక్ష్యం, ఉల్లంఘనలు, ఆర్థిక అవతవకలకు పాల్పడిన ఆరోపణలతో అశోక్‌ను పీకి పారేసేవారని వ్యాఖ్యానించారు. అది దివాణా పాలన కదా అడిగే దిక్కే లేదన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు చాలా కాలం పడుతుందన్నారు. అశోక్‌ చట్టవిరుద్ద చర్యలపై ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. దొంగలు ఆనవాళ్ళను ఎలా చెరిపేస్తారో అధికారులకు బాగా తెలుసన్నారు. అశోక్‌ ముసుగు తీసి అతని అక్రమాలను బహిర్గతం చేసే ఆధారాలు వారి కళ్ళ ముందే ఉన్నాయని విజయసాయి అన్నారు.

ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్? అంటూ ప్రశ్నించారు. సాక్ష్యాత్తు అప్పన్న ఆస్తులను బాబు కోసం ప్రసాదంలా పంచిపెట్టారని ఆరోపించారు. 748 ఎకరాల విలువ 10 వేల కోట్ల పైనే ఉందన్నారు. ఆలయ రికార్డుల నుంచి ఆ భూముల వివరాలు తొలగించడమంటే సాధారణ కుంభకోణం కాదన్నారు. స్కాముల సముద్రంలో ఇది నీటి బొట్టేలనని, ఇంకా చాలా వస్తాయి బయటకు విజయసాయి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement