Wednesday, May 15, 2024

‘పాట్’‌ పరిధిలోకి మరిన్ని పరిశ్రమలు.. కొత్తగా 143 గుర్తించిన ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ : పరిశ్రమల్లో ఇంధన సమర్ధ వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెర్ఫర్మ్‌, అచీవ్‌, ట్రేడ్‌ (పాట్‌) పథకం పరిధిలోకి కొత్తగా మరికొన్ని పరిశ్రమలను, సెక్టార్లను తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే పాట్‌ పథకం పరిధిలో ఉన్న సెక్టార్ల నుంచి కొత్తగా 143 పరిశ్రమలను గుర్తించింది. అలాగే, ఇప్పటికే ఉన్న సెక్టార్లకు తోడు అదనంగా మరి కొన్ని పారిశ్రామిక సెక్టార్లను కూడా గుర్తించింది. ఈసెక్టార్లను కూడా పాట్‌ పథకంలోకి తీసుకువస్తే వీటికి సంబందించిన మరో 85 పరిశ్రమలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది. పరిశ్రమల్లో విద్యుత్‌ను, ఇతర ఇంధన వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఇంధన వృధాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాట్‌ పథకం అమలు చేస్తుంది. దీని వల్ల పరిశ్రమల్లో తక్కువ ఇంధనంతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు వీలవుతుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో 2031 కల్లా 47.5 ఎంటీఓయి (మిలియన్‌ టన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వివలెంట్‌ ) ఇంధనం ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందువల్ల ఇంధన వినియోగం కొంత మేర తగ్గి పరిశ్రమలకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండటమేగాక, దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో విద్యుత్‌ డిమాండ్‌ను కొంత మేర తగ్గించేందుకు అవకాశం ఉంటు-ంది. ఇందుకోసమే పాట్‌ పథకం ద్వారా ఇంధన సామర్ధ్య సాంకేతికతను పరిశ్రమలకు అందిస్తారు.

36 పరిశ్రమల్లో రూ. 5,706 కోట్ల మేర ఆదా…

ఆంధ్రప్రదేశ్‌లోని 36 భారీ పరిశ్రమల్లో పాట్‌ పథకం అమలు చేయటం ద్వారా రూ 5709 కోట్ల విలువైన 0.818 ఎంటీ-ఓయి ఇంధన వినియోగాన్ని తగ్గించడం జరిగింది. అంతిమంగా ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుంది. పాట్‌ పథకం ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో మరిన్ని పారిశ్రామిక సెక్టార్లను, వాటికి సంబందించిన పరిశ్రమలను ఈపథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాట్‌ పథకం పరిధిలో ఉన్న క్లోర్‌-ఆల్కలీ, స్టీల్‌, సిమెంట్‌, వాణిజ్య భవనాలు (ఎయిర్పోర్ట్‌, హోటళ్లు), టెక్స్టైల్స్‌ తదితర సెక్టార్ల నుండి కొత్తగా 143 పరిశ్రమలను పాట్‌ పథకం లోనికి తీసుకు రావచ్చునని గుర్తించడం జరిగింది. అలాగే కొత్తగా ఫార్మా, ఇంజనీరింగ్‌, ఆటోమొబైల్‌, సిరామిక్స్‌, ఆహార, మత్స్య పరిశ్రమల సెక్టార్లను పాట్‌ పథకంలోకి తీసుకు రావచ్చునని గుర్తించడం జరిగింది. వీటిని పాట్‌ పరిధిలోకి తీసుకు వస్తే వీటికి సంబందించిన మరో 85 పరిశ్రమలు కూడా పాట్‌ పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీకు ప్రతిపాదనలు పంపాల్సిందింగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ అధికారులను ఆదేశించారు.

ప్రగతి నివేదిక విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ పాట్‌ పథకం ప్రగతి నివేదిక ను చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కే విజయానంద్‌, ఎస్‌ఈసీఎం అధికారులతో వివిధ ఇంధన సామర్ధ్య అంశాల గురించి చర్చించారు. పాట్‌ పథకం కింద భారీ పరిశ్రమల్లో ఇంధన వినియోగ సామర్ధ్యాన్నిపెంచడం, తద్వారా పెద్ద ఎత్తున ఇంధనాన్ని ఆదా చేయటం పట్ల సంబంధిత పరిశ్రమలను, ఇంధన, పరిశ్రమల శాఖలను ఆయన అభినందించారు. ఈ కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఇంధన సామర్థం, ఇంధన పరిరక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ శాఖ విభాగ అధికారులను ( హెచ్‌ఓడీలు ) ఆయన ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంధన సామర్థ్యంపై మూడు నెలలకు ఒక సారి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ , పరిశ్రమలు, జల వనరుల శాఖ , పురపాలక శాఖ , విద్య శాఖ తదితర కార్పొరేషన్లు ఇంధన సామర్ధ్య విభాగాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఇంధన శాఖకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు..

ఇంధన సామర్థ్యం, ఇంధన పరిరక్షణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇంధన భద్రత సాధించడం, 24/7 విద్యుత్‌ సరఫరాను బలోపేతం చేయడంలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక వాతవరణ కాలుష్యాన్ని తగ్గించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇంధన సామర్థ్యం (ఎనర్జీ ఎఫీషియన్సీ) దోహదపడుతుందని తెలిపారు. ఈ దృష్ట్యా ప్రభుత్వ శాఖలు ఇంధన సామర్థ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పాట్‌ పథకం అమలుకు సహకరిస్తున్న కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అలోక్‌ కుమార్‌కు, బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ఇంధన సామర్ధ్య కార్యక్రమాల భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ సీఎస్‌కు వివరించారు. ఇంధన పరిరక్షణ విభాగాల ఏర్పాటుపై వివిధ ప్రభుత్వ శాఖలకు తగు ఆదేశాలు జారీ చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. వివిధ కీలక రంగాల్లో ఇంధన సంరక్షణ సాంకేతికతను అమలు చేసేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర విద్యుత్‌ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement