Saturday, May 4, 2024

AP: మోడీ సార‌ధ్యంలో రైల్వేలో అధునీక‌ర‌ణ‌.. ప్ర‌యాణీకుల సౌక‌ర్యాల‌కు పెద్ద పీట – కిష‌న్ రెడ్డి..

విజయవాడ: ప్రధాని మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని, రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. గుంటూరు రైల్వే స్టేష‌న్ లో మూడు పొడిగింపు రైళ్ల‌ను ప్రారంభించేందుకు ఆయ‌న నేటి ఉద‌యం విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు.. ఈ సంద‌ర్భంగా రైల్వే ఉన్న‌తాధికారులు ఆయ‌న‌కు స్వాగతం ప‌లికారు. ఆ త‌ర్వాత విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడుతూ.. జనరల్ బడ్జెట్‌లో రైల్వేను విలీనం చేసి ఆర్ధికపరమైన సహకారం మోడీ అందిస్తున్నారన్నారు. రైల్వే మన దేశ సమగ్రతకు అద్దం పడుతోందన్నారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామన్నారు. 508 ర్వైల్వే స్టేషన్లను అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసేందుకు మోడీ భూమిపూజ చేశారని పేర్కొన్నారు.

41వందే భారత్ ట్రైన్లు, స్వదేశీ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు కిషన్‌రెడ్డి. ఇక, 2.94 లక్షల కొత్త ఉద్యోగాలు రైల్వేలో కల్పించామని తెలిపారు. 100 మీటర్ల పొడవైన స్క్రీన్ తో అతిపెద్ద ఆపరేషనల్ కమాండ్ సెంటర్ పనిచేస్తోంది.. రెండు ఫ్రైట్ కారిడార్లు.. లుథియానా నుంచీ బీహార్ సోన్ నగర్ వరకు, ముంబై జవహర్ లాల్ నెహ్రూ పోర్టు నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని దాద్రి వరకూ ఉంటాయన్నారు. జమ్మూకాశ్మీర్ లో చినాబ్ నది మీద ఐఫిల్ టవర్ కంటే అత్యంత ఎతైన పిల్లర్ల మీద వెళ్ళే రైల్వే బ్రిడ్జి నిర్మించామని వెల్లడించారు. విశాఖ నుంచి అరకు వరకూ విస్టాడాం కోచ్ లను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.. 6100 రైల్వేస్టేషన్ లలో ఫ్రీ హైస్పీడ్ వైఫై ఇచ్చామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ప్రజలు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపైనే మోదీ ఆలోచనలు, ఆచరణ అనేది అందరూ తెలుసుకోవాలి. కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement