Thursday, May 2, 2024

Minerals Mafia – కందిప‌ప్పుకు ఫౌడ‌ర్ కోటింగ్ – ప‌ప్పు దినుసుల‌కూ మాలిష్…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో:

రాష్ట్రంలోని పలు దాల్‌ మిల్లుల కేంద్రం గా కొత్త తరహా దోపిడీ సాగుతోంది. కందిపప్పుతో పాటు మినపప్పులో ప్రమాదకరమైన పౌడర్‌ను కలుపుతు న్నారు. దీంతో పప్పు బరువు మరింత పెరగడంతో పాటు మిల్లర్లకు రెండు రకాలుగా రాబడి పెరుగుతుంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా పలువురు దాల్‌ మిల్లర్లు తమ మిల్లుల్లో ఈ వ్యవ హారాన్ని నడుపుతున్నారు. పప్పు దిను సులకు పాలిష్‌ ముసుగులో మాలిష్‌ చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన తెల్ల పౌడర్‌ కందిపప్పు, మినపప్పుల్లో కలపడం ద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడడంతో పాటు క్యాన్సర్‌ సోకే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాల్‌ మిల్లర్లు మాత్రం తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్దఎత్తున పౌడర్‌ కలిపిన పప్పు దినుసులు ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కాలంలో కంది, మినపప్పు ధరలు అమాంతంగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ఇదే అదునుగా భావించి దోపిడీకి తెరలేపుతున్నారు. ఆయా మిల్లుల స్థాయిని బట్టి రోజుకు ఒక్కో మిల్లులో 30 నుంచి 50 టన్నుల కందిపప్పు ఉత్పత్తి అవుతున్నాయి. అవే మొత్తంలో అమ్మకాలు కూడా సాగుతున్నాయి. పప్పు దినుసుల్లో పౌడర్‌ కలపడం ద్వారా తూకాల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 50 కేజీల కందిపప్పు బస్తాకు 5 నుంచి 7 కేజీల వరకు బరువులో తేడా కనిపిస్తుంది. పౌడర్‌ కలిపిన కందిపప్పు 43 కేజీలకే 50 కేజీల బస్తా బరువు చూపిస్తుంది. అంటే సగటున ఒక్క బస్తాలోనే మిల్లర్‌కు 750 రూపాయలకు పైగా అడ్డదారిలో ఆదాయం లభిస్తుంది. 100 కేజీలకు 1500 వంతున రోజుకు 50 టన్నులకు పైగా అమ్మకాల్లో లక్షల్లో దందా సాగుతున్నట్లు స్పష్టంగా గణాంకాలు చెబుతున్నాయి.

పప్పు దినుసులకు ..పాలిష్‌తోమాలిష్‌
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో సుమారు 600కుపైగా దాల్‌ మిల్లులు ఉన్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 40కి పైగా మిల్లులు ఉన్నాయి. వీటి పరిధిలో మిల్లు స్థాయిని బట్టి రోజుకు 30 నుంచి 50 టన్నుల పప్పు దినుసులు ఉత్పత్తి అవుతున్నాయి.సగటున ఒక్కో మిల్లులో 50 టన్నుల వంతున రోజుకు సుమారు 25వేల నుంచి 30 వేల టన్నులు పప్పు దినుసులు ఉత్పత్తి, అమ్మకాలు సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పప్పు దినుసుల ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. కేజీ కందిపప్పు 150 రూపాయలు .. కేజీ మినపప్పు 120 రూపాయలు ధర పలుకుతుంది. ఓ వైపు పెరిగిన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నిన్న మొన్నటి వరకు కేజీ కందిపప్పు 80 రూపాయలు .. మినపప్పు 90 రూపాయల వరకు ఉన్న ధరలు అమాంతంగా రెండింతలు పెరగడంతో సామాన్యులు పప్పు తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. మిల్లర్లు మాత్రం రాష్ట్రంలో పప్పు దినుసులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ధరలను మరింత పెరిగేలా వ్యవహరించడంతో పాటు అడ్డదారుల్లో పాలిష్‌ పేరుతో తెల్ల పౌడర్‌ కలిపి మాలిష్‌ చేస్తున్నారు. పౌడర్‌ కలపడం ద్వారా పుచ్చిన పప్పు కూడా నాణ్యంగా మెరుగైన దినుసులు లాగా కనిపిస్తాయి. దీంతో మిల్లర్లు అంతా పౌడర్‌ కలిపిన కంది, మినపప్పును తయారుచేసి హోల్‌సేల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

పప్పు ధరలు పెరగడంతో.. ఇదో కొత్త దోపిడీ
అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో కంది, మినుము పంటలను కూడా రైతులు సాగు చేస్తుంటారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం పై రెండు పంటల సాగు తగ్గుముఖం పట్టింది. పంట దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో లేవు. దీంతో పొరుగున ఉన్న బర్మా నుంచి పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. పెరిగిన ధరలను తమకు అనుకూలంగా మల్చుకున్న మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి అవుతున్న కందిపప్పు, మినపప్పులను మిల్లులకు తరలించి అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పౌడర్‌ కలుపుతున్నారు. గతంలో దాల్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేవారు. ప్రస్తుతం తనిఖీలు, దాడులు మొక్కుబడిగా సాగుతుండడంతో మిల్లర్లదే ఇష్టారాజ్యమైపోయింది.

- Advertisement -

ప్రమాదకరమైన పౌడర్‌ వాడకం.. ప్రజారోగ్యంతో చెలగాటం
కందిపప్పు, మినపప్పుల్లో మిల్లర్ల కేంద్రంగా కొన్ని మిల్లుల్లో అత్యంత ప్రమాదకరమైన తెల్ల పౌడర్‌ను కలుపుతున్నారు. ఆ పౌడర్‌ కలిపిన పప్పు దినుసులను వాడితే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. సాధారణ కందిపప్పకు.. పౌడర్‌ కలిపిన కందిపప్పుకు నాణ్యతలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. తెల్లపౌడర్‌ కలిపిన పప్పు దినుసులు చూడడానికి నాణ్యతగా, మెరుగ్గా కనిపిస్తాయి. అయితే వాటిని ఆహారంలోకి తీసుకుంటే విలువైన ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ ఆహార భద్రతా చట్టాలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా మిల్లర్లు కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారు.

నేడు బెజవాడ కేంద్రంగా వ్యాపార సంఘాల సమావేశం
ఇదిలా ఉండగా, పప్పు దినుసుల వ్యాపారులంతా బుధవారం విజయవాడ కేంద్రంగా సమావేశం కాబోతున్నారు. కీలకమైన ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4వేల మంది హోల్‌సేల్‌ వ్యాపారుల్లో 50 శాతం మందికి పైగా వ్యాపారులు హాజరు కాబోతున్నారు. కందిపప్పు ధరలు, పప్పు దినుసుల్లో పౌడర్‌ వాడకం, తదితర అంశాలపై చర్చించి సమావేశంలో వ్యాపారులంతా ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement