Tuesday, April 30, 2024

ఆ 42 మందిలో అర్హులు ఎంద‌రో.. డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పోలీసుశాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో పలు చోట్ల విధులు నిర్వహిస్తున్న 42 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. అదేవిధంగా మరోవైపు ఇప్పటికే అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన డిఎస్పీలు పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్నారు. అయితే వీరికి ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్ధీకరణ ప్రస్తుతం అడ్డంకిగా మారింది. కొత్త జిల్లాలు ఏర్పడక ముందు పాత జిల్లాల సమయంలో పదోన్నతులు లభించగా, ఈలోగా కొత్త జిల్లాల ఆవిర్భావంతో కొంత కసరత్తు జరగాల్సి ఉన్నందున వీరికి పోస్టింగ్‌ కల్పించడంలో ఆలస్యం జరుగుతోంది. అదనపు ఎస్పీలుగా పదోన్నతి లభించిన వారిలో కొందరు డిఎస్పీలుగా ప్రస్తుతమున్న స్ధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా కొత్తగా మరో 42 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాల్సి ఉన్నందున సదరు డిఎ స్పీలకు సంబంధించిన సర్వీసు రికార్డులను పరిశీలించి పలు అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పదోన్నతి పొందిన అదనపు ఎస్పీలు పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తుండటాన్ని అలా ఉంచితే పదోన్నతి రావాల్సిన డిఎసీ ్పలకు సంబంధించి 2021-22 ప్యానల్‌ ఇయర్‌కుగాను జాబితా సి ద్ధమైంది.

జాబితాలోని అధికారులు వీరే..
జాబితాలో ఎంకెఎం నాయుడు (సిఐడి), కె కేశప్ప (ఎస్సీ,ఎస్టీసెల్‌-2 చిత్తూరు), జి రామకృష్ణ (డిటిసి ప్రకాశం), వైబిపిటిఏ ప్రసాద్‌ (ఎస్సీ,ఎస్టీసెల్‌-1నెల్లూరు), ఎస్‌ఆర్‌ రాజశేఖర్‌రాజు (కంట్రోల్‌ రూము విజయవాడ), జెవి సంతోష్‌ (రాజమండ్రి సెంట్రల్‌), ఆర్‌ శ్రీహరి బాబు (పిసిఎస్‌ అండ్‌ ఎస్‌), ఎస్‌ ఖాదర్‌ భాషా (విజయవాడ సెంట్రల్‌), ఎం మహేంద్ర (ఎస్‌డిపిఓ శ్రీకాకుళం), జి ప్రేమ్‌కాజల్‌ (దిశ విశాఖపట్నం), ఎస్‌కె మసూంభాషా (ఎస్‌డిపిఓ మచిలీపట్నం), జి శ్రీనివాసరావు (డిటిసి శ్రీకాకుళం), పి ఉమావతి వర్మ (పిసిఎస్‌ అండ్‌ ఎస్‌), ఎన్‌ విష్ణు (ఎస్‌ఇబి), ఎంజెవి భాస్కరరావు (సిసిఎస్‌ రాజమండ్రి), ఆర్‌విఎస్‌ఎన్‌ మూర్తి (ఎస్‌డిపిఓ ద్వారకా విశాఖపట్నం), జివి రమణమూర్తి (సిటిఎఫ్‌ విజయవాడ సిటి), వి ఉమామహేశ్వరరావు (ఎస్సీ, ఎస్టీ సెల్‌-2 కృష్ణా), ఎల్‌ సుధాకర్‌ (సిసిఎస్‌ తిరుమల), సిహెచ్‌ సురేష్‌ (ఎస్‌పిఎఫ్‌), సిహెచ్‌ రవికుమార్‌ (సిఐడి), ఎస్‌కె చంద్రశేఖర్‌ (ఎస్‌బి-1 తిరుపతి), ఎం అంతోనప్ప (ఎస్సీ, ఎస్టీ సెల్‌-1 అనంతపురం), ఆర్‌ విజయభాస్కరరెడ్డి (ఎస్‌డిపిఓ సత్తనపల్లి), టి మోహన్‌రావు (ఎస్సీ, ఎస్టీ సెల్‌ విశాఖపట్నం), పి శంకర్‌ (ఏపిఎస్‌పి 3వ బెటాలియన్‌ కాకినాడ అండర్‌ సస్పెన్షన్‌), డివి రమణమూర్తి (ఏపీఎస్‌పి 14వ బెటాలియన్‌ అనంతపురం), కె ప్రవీణ్‌కుమార్‌ (డీటీసీ విశాఖపట్నం), జె మల్లిఖార్జునవర్మ (పిటిసి అనంతపురం), జె తిప్పేస్వామి (ట్రాఫిక్‌ చిత్తూరు)..

ఏవి రమణ (డిసిఆర్‌బి ప్రకాశం), బిఆర్‌ శ్రీనివాసులు (ఏపిఎస్‌పి ఐదో బెటాలియన్‌ విజయనగరం), ఎం వెంకటరమణ (ఎస్‌బి-2 తిరుపతి), ఎన్‌ నాగరాజు (ఎస్‌డిపిఓ కడప), కె తిరుమలరావు (దిశ రాజమండ్రి), వై హరినాధ్‌రెడ్డి (ఎస్‌డిపిఓ నెల్లూరు), వి భీమారావు (ఎస్‌డిపిఓ కాకినాడ), ఎం వెంకటేశ్వరరావు (ఎస్‌బి తూర్పుగోదావరిజిల్లా), ఎం శివరామిరెడ్డి (ఎస్‌డిపిఓ కాశిబుగ్గ), సిహెచ్‌ విజయభాస్కరరావు (ఎస్‌డిపిఓ నరసరావుపేట), అదేవిధంగా ఇంటిలిజెన్స్‌ విభాగంలో పని చేస్తున్న జి వెంకట్రాముడు, ఆర్‌ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.

సమగ్ర పరిశీలన అనంతరమే..
కాగా ప్యానల్‌లో ఉన్న అధికారులకు సంబంధించి సర్వీసు రికార్డులు, వారిపై ఉన్న ఆరోపణలు, పనిష్‌మెంట్స్‌, విచారణలు, క్రమశిక్షణచర్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమర్పించాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యూనిట్‌ అధికారులకు సమాచారం చేరింది. దీంతో జాబితాలోని అధికారులకు సంబంధించి సర్వీసు రికార్డులతో సంబంధిత అధికారులు ఈనెల 16వ తేదీన లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీపీ ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందాల్సి ఉన్న డిఎస్పీల సర్వీసు రికార్డు వివరాలను ఉన్నతాధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఈక్రమంలో పదోన్నతులకు అర్హుల జాబితా రూపకల్పనకు సంబంధించి కసరత్తు జరుగుతోందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. కాగా సర్వీసు రికార్డుల సమగ్ర పరిశీలన ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అదనపు ఎస్పీలుగా పదోన్నతికి అర్హులైన డిఎస్పీల జాబితా సిద్ధం చేసిన ముఖ్య కార్యాలయం ప్రభుత్వానికి నివేదించనుంది. సర్కార్‌ ఫైనల్‌ చేసిన మీదట అధికారికంగా ప్రమోషన్ల జాబితా కొద్దిరోజుల్లో వెలువడనుంది. ఈమేరకు పదోన్నతులు ఆశిస్తున్న డిఎస్పీలు ఇప్పుడా అప్పుడా అన్నట్లు నిరీక్షణలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement