Saturday, May 4, 2024

AP : రేప‌టి నుంచి మ‌హానందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు…

రేప‌టి నుంచి మ‌హానందిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 6నుంచి 11వ‌ర‌కు మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. ప్రతిరోజు మహానందీశ్వర స్వామివారికి అభిషేకాలు, వాహన సేవలు, విశేష పూజలు నిర్వహించనున్నారు.

- Advertisement -

ఐదు రోజులపాటు జరగనున్న విశేష వేడుకలలో భాగంగా మార్చి 8వ తేదీన మహానందీశ్వర స్వామి వారికి రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేయనున్నారు. ఆపై తెల్లవారుజామున 3 గంటలకు కామేశ్వరి దేవి సహిత నందీశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. మార్చి 9వ తేదీన కళ్యాణమూర్తులకు పల్లకి సేవలు నిర్వహించి ఘనంగా పండుగ జరుపనున్నారు.

ఆపై మార్చి 10వ తేదీన మహా రథోత్సవాన్ని నిర్వహించి, రధంపై ఊరేగే స్వామి భక్తులను కరుణించనున్నారు. మార్చి 11వ తేదీన త్రిశూల స్నానం నిర్వహించి, తెప్పోత్సవంలో భాగంగా మహానందీశ్వర స్వామి వారు కామేశ్వరి దేవి సహితంగా పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయి.

ఇక మహాశివరాత్రి ఉత్సవాల కోసం మహానంది ఆలయ అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, 10 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం లక్షన్నర లడ్డూలను సిద్ధం చేయనున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా మహానందీశ్వర ఆలయానికి భక్తి జనం పోటెత్తనున్న నేపథ్యంలో అందుకు తగిన మౌలిక వసతుల కల్పనకు ఆలయ అధికారులు కృషి చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 6వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement