Friday, April 26, 2024

Delhi: మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ టెస్ట్‌కి పంపాలి.. రాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద నగ్న వీడియో వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ పేరుతో మహిళా నేతల బృందం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సహాయంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న మహిళా నేతలు రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్, జాతీయ మహిళా కమిషన్‌కు విడివిడిగా ఫిర్యాదులు అందజేశారు.

2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. భయాందోళనల మధ్య రాష్ట్రంలోని మహిళలు జీవనం సాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో మహిళలపై నేరాలు 21.45 శాతం పెరిగాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని అన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు, గతంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్, తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి అసభ్యకర ప్రవర్తనతో దొరికిపోయారని తెలిపారు. గోరంట్ల మాధవ్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదై అత్యాచారం, హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజాగా నగ్న వీడియో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల మాధవ్ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపించాలని ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జస్టిస్ వర్మ కమిషన్ నివేదికను అమలు చేయాలని రాష్ట్రపతిని కోరారు. గోరంట్ల మాధవ్ వీడియో క్లిప్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్నవారిని గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధించాలని, ఆ మేరకు వర్మ కమిషన్ సిఫార్సులను కఠినంగా అమలు చేయాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఎన్నికైన ప్రతినిధులు ఈ తరహా ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటే తక్షణమే వారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అందరికీ లింగబేధం, లింగవివక్ష, లైంగిక వేధింపులు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణనివ్వాలని సూచించారు. – ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా… లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడినా.. వెంటనే సూమోటోగా కేసులు నమోదు చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి సమన్లు జారీ చేసి విచారణ జరపాలని కోరారు.

‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ జేఏసీగా ఏర్పడిన బృందానికి వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. చెన్నుపాటి కీర్తి కన్వీనర్‌గా వ్యవహరించారు. కో-కన్వీనర్లుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ వ్యవహరించగా.. ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి (NFIW), తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి సవిత సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement