Tuesday, April 30, 2024

Delhi: లిక్కర్ స్కాంలో అందరి పేర్లు బయటపెట్టాలి.. టీఆర్‌ఎస్‌పై మండిపడ్డ తెలంగాణ కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు చెప్పినట్టే మిగతా అందరి పేర్లూ బయటపెట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు, మహేశ్వర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గాంధీ టోపీ నెత్తిన పెట్టుకుని తామే అసలైన గాంధీ వారసులం అని చెప్పుకున్న ఆప్ మద్యం కుంభకోణానికి పాల్పడిందని భట్టి ఎద్దేవా చేశారు.కేబినెట్ లేదా మంత్రుల కార్యాలయాల్లో ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకుంటారన్న ఆయన, అందుకు విరుద్ధంగా ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో లిక్కర్ పాలసీ తయారవడం సిగ్గు చేటన్నారు.

ఢిల్లీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు పాలసీ తయారుచేయడమే కాక, భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర తరహా పాలసీనే ఢిల్లీలో తయారుచేశారన్న భట్టి విక్రమార్క, ఢిల్లీ పాలసీ ఇంత పెద్ద స్కాం అయినప్పుడు తెలంగాణ పాలసీ కూడా పెద్ద స్కామే కదా అని అనుమానం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం ఆదాయం రూ. 10 వేల కోట్ల లోపే ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు కేవలం తెలంగాణలోనే రూ. 30 వేల కోట్ల పైన ఆదాయం వస్తోందని గణాంకాలు చెబుతున్నాయని భట్టి వివరించారు. ధరల నియంత్రణ కమిటీలు, కమిషన్ విషయాలపై తాము చాలా సార్లు మాట్లాడామని ఆయన గుర్తు చేశారు.

ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణలో లక్ష కోట్లకు పైగా అక్రమాలు జరిగి ఉంటాయని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు 35 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు బెల్ట్ షాపుల్లో రూ.200కు దొరుకుతోందంటే సామాన్యుడు ఏ స్థాయిలో దోపిడీకి గురవుతున్నాడో ఆలోచించాలన్నారు. ఆ సొమ్మంతా ఎక్కడికిపోతోందని భట్టి ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను రాజకీయ నాయకుల మీద మాత్రమే కాకుండా దేశ సంపద దోపిడీ జరగకుండా చూడడం మీదా ప్రయోగించాలని ఆయన సూచించారు.

విచారణ జరిపి చర్యలు చేపట్టండి : మధుయాష్కీ
అగ్గిపుల్ల, కుక్కపిల్ల కాదేదీ ‘కవిత’కు అనర్హమని శ్రీశీ అన్నట్టు ఎమ్మెల్సీ కవిత అక్రమ సొమ్మును పోగేయడంలో కాదేదీ అనర్హమని మధుయాష్కీ ఎద్దేవా చేశారు. చీకోటి స్కాములో కూడా ఆమె పేరు వినిపించింది, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ ఆమె పేరు ఉందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ అన్ని అంశాల్లో కమిషన్లు 30శాతం వరకు దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. కవితకు సన్నిహితుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని సీబీఐ చెబుతోందన్నారు. ఐటీ దాడులు జరుగుతున్న ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు కవితకు చెందిన జాగృతి సంస్థతో లింకులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాబందుల సమితి పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో లిక్కర్ లైసెన్సుల విషయంలో బామ్మర్దుల పాత్ర గురించి చెప్పాలన్నారు.

గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలు కూల్చే సమయంలో కవిత అడ్డుకున్న విషయాన్ని మధుయాష్కీ గుర్తు చేశారు. టానిక్ సంస్థతో చెట్ల సంతోష్ పిల్లలకు ఇష్టారీతిన బీర్లు తాగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మద్యపాన నిషేధమా, బెల్టు షాపుల కట్టడి చేయాలా అనేది ఆలోచిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇసుక, రియల్ ఎస్టేట్ దందాల్లో టీఆరెస్ నేతలకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వస్తే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే పదవి నుంచి తప్పించిన, కేంద్రమంత్రినే జైల్లో పెట్టించిన చరిత్ర కాంగ్రెస్‌దని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మీద ఉత్తుత్తి ఆరోపణలు చేయకుండా ఆధారాలతో సహా నిరూపించాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. శవాల మీద డబ్బులను కూడా దోచుకునే స్థితిలో టీఆరెస్ నేతలు ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

అవినీతి సంపాదనకు టీఆర్‌ఎస్ సూచనలు
ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఆరోపిస్తున్న వారు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మద్యం విక్రయాల్లో ఆదర్శంగా నిలుస్తోందని, ఏకంగా ఢిల్లీకే మార్గనిర్దేశం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీతో పోలిస్తే ఒక మద్యం బాటిల్ తెలంగాణలో నాలుగింతల ధర పలుకుతోందన్న ఆయన, ఆ మార్జిన్ సొమ్మంతా టీఆర్‌ఎస్ నేతలు, అధికారుల జేబుల్లోకి వెళ్తోందని వెల్లడించారు. మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవడం కోసం అనుమతి లేని దుకాణాలు, బెల్టు షాపులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తోందని చెప్పారు.

అక్రమ మద్యం విక్రయ కేంద్రాల గురించి ఘనత వహించిన పోలీసుల దృష్టికి రావడం లేదా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అవినీతి, అక్రమాల ద్వారా సొమ్ము ఎలా పోగేయాలనే విషయం మీద టీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలకు గైడెన్స్ ఇస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఊరికే ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతన్న జీవన్‌రెడ్డి, సీబీఐ ముందు ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇదంతా కుమ్మక్కు రాజకీయం లేదా అసమర్ధ పోలీస్ యంత్రాంగమనే విషయం అర్థమవుతుందని చెప్పారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఫీనిక్స్ సంస్థ సురేష్ చుక్కపల్లి టిఆర్ఎస్ నేతల బినామీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సమయంలో జనాన్ని బెదిరించి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాడని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement