Sunday, May 5, 2024

AP: మార్పు కోసం మొదలైన లోకేశ్ పాదయాత్ర జనసందం.. ప్రత్తిపాటి

చిలకలూరిపేట, ఆగస్టు 31 (ప్రభ న్యూస్) : లోకేశ్‌ ఒక్క అడుగే.. ఉత్తుంగ తరంగమైందని.. మార్పు కోసం మొదలైన ప్రజా యాత్ర జనసంద్రం అవుతూ దిగ్విజయంగా సాగుతోందని మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నిన్నటి కంటే ఈ రోజు.. ఈ రోజు కంటే రేపు.. బావుండాలి అని రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్‌ కోసం కలలు గన్న దార్శనికుడు చంద్రబాబు బాటలో సాగుతున్న యువనేత జన చైతనయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషకరమని ప్రత్తిపాటి తెలిపారు. వారసుడి నుంచి ప్రజాకర్షక నేతగా, భయం వైపు నుంచి భవిష్యత్తుపై భరోసా దిశగా.. అవహేళనల నుంచి అద్భుతం అనిపించుకునేలా లోకేశ్‌ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పాదయాత్రలన్నీ ఒక ఎత్తయితే.. లోకేశ్ యువగళం పాదయాత్ర మరో ఎత్తని.. అడుగుపెట్టిన ప్రతిచోటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారీటిలతో మమేకమై ఆయా వర్గాల సమస్యలపై యువగళాన్ని మార్మోగిస్తున్నారని తెలిపారు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. యడ్లపాడు మండలం సంగం గోపాలపురం నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట ఇస్కాన్ ఆలయం వరకు పాదయాత్ర సాగింది. భారీగా హాజరైన జనసందోహం మధ్య ప్రత్తిపాటి ఉత్సాహంగా నడిచారు. చెంఘీజ్‌ఖాన్‌పేట వద్ద ఇస్కాన్ ఆలయం వద్ద ప్రత్తిపాటి సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ… కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 400 రోజుల పాటు… 4000 వేల మీటర్ల మేర తలపెట్టిన మహాసంకల్పంలో సరిగ్గా ప్రథమార్థం పూర్తి చేసుకుందని.. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు కనని… వినని రీతిలో సాగుతున్న ఈ పవిత్రయజ్ఞ సంకల్పం.. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడనుందన్నారు. ఈ అరాచక పాలనలో భీతిల్లిన కోట్లాది మంది ప్రజలకు నేనున్నా అని ఒక భరోసా ఇవ్వడమే లక్ష్యంగా వారి కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ… రేపటి మీద ఆశలు కల్పిస్తూ లోకేశ్ ముందుకు సాగిపోతున్నారని ప్రత్తిపాటి వెల్లడించారు.

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం.. ఆ పునరాగమనంలో యువతరానికే పెద్దపీట వేయడమే నినాదాలుగా రాజకీయ యాత్రల్లోనే సరికొత్త చరిత్ర లిఖిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అడుగుపెట్టిన ప్రతిచోటా జనహారతులు, పార్టీ జయజయధ్వనాలే రాబోతున్న మార్పుకి సంకేతాలని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెదేపా చరిత్ర సృష్టించబోతోందన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఇస్కాన్‌ సంస్థకు 77 ఎకరాలు ఇవ్వడం జరిగిందని.. హంస దేవాలయంగా రూపొందించేలా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు నమూనా కూడా తయారు చేశారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇస్కాన్ నిర్వాహకులను నిరుత్సాహ పరిచారని.. కొండవీడు కోటను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండవీడు కోట, ఇస్కాన్ ఆలయ పరిసర ప్రాంతాల్లో రైతుల భూముల ధరలు రూ.2 కోట్ల వరకు పలికాయని.. ప్రస్తుతం భూముల ధరలు భారీగా పడిపోయి ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇస్కాన్ ఆలయ అభివృద్ధిపై మంత్రి రజిని ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా అని ప్రత్తిపాటి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement