Saturday, April 27, 2024

లోకేష్ పాదయాత్ర @ జీఓ నెం.1 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు జీవో నెంబర్ 1 మాటున ఆరు ఘర్షణలు, మూడు కేసులుగా కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు కొనసాగిన 15 రోజుల యాత్రలో  ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గీయులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం తప్పడం లేదు. కేవలం లోకేష్ యాత్రను అడ్డుకోవడానికి అధికార పక్షం పథకం ప్రకారం చేస్తున్న కుట్రలే గొడవలకు కారణమవుతున్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నిర్దేశిత నిబంధనలను అతిక్రమించినప్పుడు మాత్రమే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందే తప్ప తమ వైపు నుంచి యాత్రకు ఎటువంటి అడ్డంకులు పెట్టడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరచడమే లక్ష్యంగా గత జనవరి 27వ తేదీన కుప్పంలో యువగళం మహా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.. శనివారం నాటికి 15 రోజులు పూర్తి చేసుకుని 16వ రోజు అడుగుపెట్టిన పాదయాత్ర కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు శాసనసభ నియోజకవర్గాలు గుండా కొనసాగి ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆ యాత్ర మరో రెండు రోజుల్లో నగరి నియోజకవర్గంలో ప్రవేశించ నున్నది.

ఇప్పటి వరకు 15 రోజుల పాటు కొనసాగిన యాత్రలో  ప్రజాస్పందన  సంగతెలా ఉన్నా ప్రతి నియోజకవర్గంలో పోలీసులకు, తెలుగుదేశం వర్గీయులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కుప్పంలో రహదారిలో రోడ్డు షో చేయడాన్ని నిరోధించడానికి యత్నించడంతో గొడవ మొదలైంది. పలమనేరులో సభా వేదిక గా వాహనం సీజ్ చేయడం, బంగారుపాళెం, ఎంఆర్ పేట, సంసిరెడ్డి పల్లె, ఎస్ఆర్ పురం పుల్లూరు క్రాస్ వద్ద ప్రజలను ఉద్దేశించి వినియోగించే సౌండ్ సిస్టంను సీజ్ చేయడం, మైక్ ను లాక్కోవడం వంటి చర్యలు పోలీసులు చేపట్టారు. ఆ ప్రయత్నాలను సహజంగానే లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులు ప్రతిఘటించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక చోట ఇంటి మిద్దె పైకి ఎక్కి ప్రసంగించిన లోకేష్ అన్ని చోట్ల స్టూల్ పై నిలుచుని మాట్లాడటం మొదలు పెట్టారు. మీ వాళ్ళ పైన కేసులు పెట్టుకోండి, మేము అధికారంలో వచ్చాక వైసీపీ వారికి తొత్తులుగా పనిచేసే పోలీసు అధికారుల సంగతి తేలుస్తానంటూ  హెచ్చరికలు చేశారు. అన్నింటి కన్నా ముఖ్యంగా పోలీసులు జీఓ నెంబర్ 1 లోని నిబంధనల అతిక్రమణ గురించి వివరించడానికి యత్నిస్తే .. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతుల్లో పెట్టుకున్న లోకేష్ తనకు ఉన్న స్వేచ్ఛ ను వివరించడం మొదలుపెట్టారు. అసలు జీ ఓ నెంబర్ 1 అర్ధ రహితమని, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి జగన్ ప్రభుత్వం ప్రయోగించిన జీఓ ను మేము పట్టించుకోమని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. మరో వైపు గుమికూడిన తెలుగుదేశం మద్దతుదారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఏమీ చేయలేక పోలీసులు లోకేష్ తదితరులపై అతిక్రమణ సంబంధిత కేసులు పెట్టడానికి పరిమితం అవుతున్నారు. శనివారం అయితే పుల్లూరు క్రాస్ వద్ద మైక్ లేకుండానే ప్రజలను  ఉద్దేశించి లోకేష్ మాట్లాడారు. 

ఇది ఇలా ఉండగా తమకు ఎలాంటి ఒత్తిడులు లేవని కేవలం ప్రభుత్వ ఉత్తర్వులలోని నిబంధనలు అమలు చేయడానికే ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. యాత్రకు అనుమతి అడిగిన తొలి దశలోనే రహదారి పై తిరిగే వారికి ఇబ్బంది కలిగించే చోట సభలు పెట్టుకుంటే అనుమతులు ఇవ్వబోమని, రోడ్డుపై సభలు పెట్టుకోరాదని, నిర్దేశించిన స్థలంలో ముందస్తు అనుమతులు తీసుకుని సమావేశాలు పెట్టుకోవచ్చునని మాత్రమే తాము చెబుతున్నామని అంటున్నారు. ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్వహిస్తున్నామని, అతిక్రమించే సమయంలో నిరోధించి అతిక్రమణ గురించి చెప్పడానికి యత్నిస్తున్నామని, వినకపొతే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు. నిర్ధేశిత నిబంధనలను అతి క్రమించకుండా యాత్ర చేసుకోవడంపై తమకు ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. కాగా ఇప్పటిదాకా చిత్తూరు జిల్లా పోలీసులు లోకేష్, మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, దొరబాబు, పులివర్తి నానిలపై అయిదు కేసులు చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రాంతం దాన్ని మరో ప్రాంతంలో యాత్ర ప్రవేశించే తరుణంలో పోలీసులు నిరోధించడం, కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడం, లోకేష్ తన నిరసన తెలియచేయడం, జనం గుమి కూడడంతో పోలీసుకు వెనుతిరగడం, ఏదో ఒక చోట స్టూలుపై నిలబడి లోకేష్ ప్రసంగించడం, ఆపై యధావిధిగా ముందుకు పోవడం యాత్రలో నిత్యకృత్యంగా మారుతోంది. ఎవరి వాదనలను వారు వినిపించడానికి పరిమితమవుతున్న నేపథ్యంలో యాత్ర కొనసాగే ఇతర నియోజకవర్గాల్లో ఈ ఘర్షణ వాతావరణం కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement