Monday, April 29, 2024

వైఎస్ఆర్ భీమా చెల్లింపులో లేట్..

విజయవాడ, ప్రభన్యూస్ : ఒక కుటుంబ యజమాని చనిపోతే ఆ అభాగ్యుల బాధలు వర్ణనాతీతం. సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో పూట గడవని పరిస్థితుల్లో ఆ ఇంట్లో వారంతా దిక్కులేని వారవుతారు. గత ప్రభుత్వ హయాంలో అలాంటి అభాగ్యులను ఆర్థికంగా ఆదుకునేందుకు బీమా పథకం ప్రవేశపెట్టింది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్త పథకాన్ని 2020 అక్టోబరు 21న ప్రవేశపెట్టింది. ఆ పథకం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సంపాదించే వ్యక్తిని కోల్పోయే నిరుపేద కుటుంబం ఇక్కట్లు- పడకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని తీసుకోచ్చామన్నారు. కుటుంబాలు చెల్లించాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబ యజమాని చనిపోతే 15 రోజుల్లో బీమా మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుందని స్పష్టం చేశారు. ఆలోగా తక్షణ సహాయంగా రూ.10 వేలు అందజేస్తామని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్‌ బీమా పథకం కింద పరిహారం కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ బాధితులు తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదంటున్నారు. మరణ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌ వంటివి సమర్పించి నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం ఖాతాలో జమ కావడం లేదు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పేరిట ఈ పథకాన్ని నిర్వహించారు. బీమా కింద ఏడాదికి రూ.15 చొప్పున ప్రీమియం బ్యాంకు ఖాతా నుంచి కంపెనీకి చెల్లించారు. సాధారణ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.5 వేలు, నిరుపేద కుటుంబానికి అంత్యక్రియల కోసం రూ.25 వేలు అందజేశారు. ఈ ప్రక్రియ మొత్తం గరిష్ఠంగా నెలరోజుల్లో పూర్తయ్యేది. ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి వివరాలు బీమా కాల్‌సెంటర్‌లో నమోదు చేయలేదు. దీంతో ఆయా కుటుంబాలు పరిహారానికి దూరమయ్యాయి. 1,893 బాధిత కుటంబాలకు పరిహారం అందాల్సి ఉంది. కుటు-ంబ యజమాని మరణంతో ఉపాధి కోల్పోయిన సభ్యులకు సకాలంలో సాయం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement