Saturday, May 4, 2024

భూముల రీసర్వే చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివాదరహితంగా భూసేవలు

దేశంలోనే తొలిసారిగా వందేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. గ్రామాల్లో పట్టా భూములు సర్వే వేగవంతంగా చేసేందుకు సర్వే డిపార్ట్‌ మెంట్ సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో (63,433 ఎకరాలు) సర్వే ప్రక్రియ ప్రారంభం కాగా.. అత్యంత వేగవంతంగా, పారదర్శకంగా,  సులువుగా, వివాదరహితంగా భూయజమానులకు భూసేవలు అందించనుంది. కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటిస్తూ రీసర్వే కార్యక్రమం చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఆస్తికి ప్రభుత్వం హామీతో కూడిన శాశ్వత హక్కు పత్రం ఇవ్వడం జరుగుతోందని సర్వే సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ జైన్ తెలిపారు. 21 డిసెంబర్ 2020న రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే ప్రారంభమైందన్నారు.“వైఎస్సార్ జగనన్న భూరక్ష -శాశ్వత భూహక్కు” పథకం ద్వారా చేసే సర్వే, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే అఫ్ ఇండియా వారి సహకారంతో చేపట్టినట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి భూసేవలను అత్యంత వేగవంతంగా, పారదర్శకంగా, సులువుగా, వివాదరహితంగా భూయజమానులకు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. శాటిలైట్ ఆధారిత ఒక ఆధునిక మౌళిక సదుపాయమని, దీని ద్వారా భూమి సరిహద్దులను అక్షాంశ రేఖాంశములలో 5 సెం .మీ ల ఖచ్చితత్వముతో కొలవగలుగుతామన్నారు. రాష్ట్రమంతా రూ.12 కోట్ల వ్యయంతో 70 స్టేషన్స్ నెలకొల్పి సర్వే అఫ్ ఇండియా నెట్వర్క్‌ తో అనుసంధానించామన్నారు.

కొత్త సర్వే విధానంపై 10,180 మంది క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ, 275 మధ్య స్థాయి సిబ్బందికి సర్వే ఆఫ్ ఇండియా లో సాఫ్ట్ వేర్ ఫై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం GNSS రోవర్స్ ట్రైనింగ్ జరుగుతోందన్నారు. మండల స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు ఉన్న రెవిన్యూ సిబ్బందికి రీసర్వేపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. మొదటగా రెవిన్యూ డివిజన్ కి ఒక గ్రామము చొప్పున 51 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ 51(63,433 ఎకరాలు) గ్రామాల్లో సర్వే ప్రక్రియ ప్రారంభమై డ్రోన్ ఇమేజెస్ ప్రింటింగ్ చేసిటన్లు వివరించారు. 40 గ్రామాల గ్రామసరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల సర్వే చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 624 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తి అయిందని సిద్ధార్ధ జైన్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement