Monday, April 29, 2024

మహిళల భద్రత, దిశ యాప్‌ పై ఎస్ఐ మారుతీ శంకర్ వినూత్న ప్రదర్శన

నందికొట్కూరు : మహిళల భద్రత కోసం ఒక ఎస్ఐ గుర్రంపై దిశ యాప్ గురించి జాతరలో మహిళలంద‌రూ అవగాహన కలిగి ఉండేలా వినూత్నంగా అందరిని ఆకర్శింపజేశారు. ప్రతి మహిళ, యువతులందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ వినూత్న ప్రదర్శన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం తర్తూరు జాతరలో జరిగింది. రాష్ట్రంలోనే అతి పెద్ద తిరుణాల, అత్యంత పేరు గాంచిన తర్తుర్ శ్రీ లక్ష్మీ రంగనాధ స్వామి జాతర ఒకటి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలంలో తర్తుర్ ఒక గ్రామం. దాదాపు 10 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతోంది. ఈ జాతరకు ఆంద్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ జాతరలో మిడుతూరు ఎస్ఐ మారుతీ శంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల భద్రత గురించి ప్రవేశపెట్టిన దిశ యాప్ పై వినూత్నంగా అవగాహన కల్పిస్తూ మహిళలందరూ వారి ఫోన్ల‌లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా గుర్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హోమ్ శాఖామంత్రి తానేటి వనిత, రాష్ట్ర డీజీపీల ఫోటోలతో దిశ యాప్ గురించి పూర్తి సమాచారం ఉన్న ఫ్లెక్సీలతో చూపరులకు అర్ధమయ్యే రీతిలో అందరిని ఆకట్టుకునేలా అవగాహన కల్పించారు.గుర్రంపై ఫ్లెక్సీ లతో ఎస్ఐ మారుతీ శంకర్ వెళ్తుండటంతో మహిళలందరూ ఆశ్చర్యంగా చూశారు. యాప్ గురించి చదివి చాలా మంది యువతులు, మహిళలంద‌రూ యాప్ గురించి తెలుసుకొని డౌన్ లోడ్ చేసుకున్నారు. కార్యక్రమంలో జూపాడుబంగ్లా ఎస్ఐ వెంకట సుబ్బయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement