Sunday, December 8, 2024

అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌తో సీమ ఎడారి : బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి

కర్నూలు : అప్పర్ భద్ర నిర్మితమైతే సీమ ఎడారిగా మారడం ఖాయమని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ చైర్మన బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు. నికర జలాల పరిరక్షణ కోసం బైరెడ్డి రాజశేఖరరెడ్డి శనివారం కోసిగి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నుండి మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో వేలాది మంది రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ప్రజలు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌పై సీమ ప్రాంత ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడితే రాయలసీమ ప్రాంతం సాగు, తాగు నీరు అందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి హెచఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు తాగునీరు వస్తున్నా.. పై భాగంలో అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కృష్ణ బ్యారెజ్‌పై తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కం బ్యారేజ్‌ నిర్మించాలని కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట నిర్మితమైతే కర్నూలు జిల్లా రైతులకు నికర జలాలు. అందుతాయి అన్న విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement