Friday, May 17, 2024

కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు

కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి విమానాశ్రయ అధికారులకు అధికారిక ఉత్తర్వులు అందాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ప్రారంభమైన‌టి నుంచి ప్రజలకు మెరుగైన సేవలను అందించినందుకు గానూ కేంద్ర విమానయాన పథకం (ఉడాన్‌) ఇన్నోవేషన్‌ సెంట్రల్‌ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్‌-2020 కింద ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించినట్లు సమాచార పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ అవార్డును ఈనెల 21న అందజేయనున్నారు.
ఓర్వకల్ విమానాశ్రయం ఏర్పాటు రాకపోకల మొదలు :
ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో విమానాల సర్వీసులు 2021 మార్చి 28 ప్రారంభమయ్యాయి. నాడు బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ఫ్లైట్ నుంచి మొత్తం 52 మంది ప్రయాణికులు దిగగా, వారిని మంత్రులు, పాలకులు, ఎయిర్ పోర్టు అధికారులు ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత అదే విమానంలో 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. దీంతో పాటు అదే రోజు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని ప్రారంభించారు. మొదటి సర్వీసులు ప్రారంభంలో భాగంగా అప్పట్లో ఫ్లైట్లో వెళ్లే ప్రయాణికులకు స్వీట్ బాక్సులతో పాటు, స్మారక పోస్టల్ కవర్ లను అందించారు. మొత్తంగా కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి బెంగళూరు.. కర్నూలు, కర్నూలు-విశాఖపట్నం, కర్నూలు-చెన్నైలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నుంచి ఇండిగో సంస్థ విమానాలు నాటి నుంచి నడుపుతుంది. మొత్తంగా రాయలసీమ వాసులు ప్రత్యేకించి, ఆంధ్రుల తొలి రాజధాని కర్నూలు జిల్లా వాసుల సొంత గడ్డ నుండి విమానయాన అరు దశాబ్దాల కలను నిజం చేస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది మార్చి 25న ఓర్వకల్/కర్నూలు ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు. ఎయిర్ పోర్ట్ కు తొలి స్వాతంత్ర్య సమర యోధులు, రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు.. మొత్తంగా కర్నూలు ఎయిర పోర్ట్ దాదాపు ఎకరాల్లో, రూ.155 కోట్లతో రూపుదిద్దుకోగా… విమాన సర్వీసుల నిర్వహణలో ఏడాది కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ఇందుకు ఉదాహరణ గత ఫిబ్రవరి నెలలో కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి 2350 మంది ప్రయాణించినట్లు.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీన్నిబట్టి ఎయిర్ పోర్టు సేవలను గుర్తించవచ్చు. ఈ సేవలకు గుర్తింపుగానే ఎయిర్ పోర్ట్ ఆఫ్ ఇండియా కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించడం విశేషం. అయితే కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడ, హైదరాబాదుకు విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించినా ఇంకా ఆచరణలోకి రాలేదు. త్వరలోనే ఆయా సర్వీసులను కూడా కొనసాగించేందుకు అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా ఓర్వకల్లు ఏయిర్ పోర్టులో విమాన సర్వీసులను ప్రారంభించి మార్చి 28 నాటికి సరిగ్గా ఏడాది అవుతుంది. ఆ లోపే ప్రధానమంత్రి ఎక్స‌లెన్సీ అవార్డు దక్కడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement