Monday, April 29, 2024

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం.. దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్న రైతులు..

కర్నూలు, (ప్రభన్యూస్‌) : రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఖరీఫ్‌కు సమయం అసన్నమవ్వడంతో రైతులు తమ భూములను సాగుకు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఖరీఫ్‌లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతవరణ శాఖ ముందస్తుగా ప్రకటించింది. బంగాళఖాతంలో రుతుపవనాల ఆవర్తనం అలుముకోగా అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 2022 ఖరీఫ్‌కు రైతులు సిద్దమవుతున్నారు. జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ వర్షపాతం 455.1 మి,మీ, వచ్చే నాలుగు నెలల్లో ఖరీఫ్‌ సాగుకు అవసరమైన వర్షాలు విసృతంగా పడే అవకాశం ఉందని భావస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద నారుమడి పోస్తున్నారు. ఇప్పుడే నారుమడి పోస్తే అడపదడప కురిసే వర్షాలతో కలిసి వస్తుందని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సందర్బంలో రైతులు మొట్ట దుక్కులు దున్ని సాగుకు సమాయత్తమవుతున్నారు. వీటికి అనుగుణంగా వ్యవసాయశాఖ పంటల వారీగా ఖరీఫ్‌ ప్రణాళిక సిద్దం చేసింది. విత్తనాలను, ఎరువులను రైతులకు పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ రైతు భరోసా కేంద్రాల ద్వార ఏర్పట్లకు సిద్దమవుతుంది. ఉమ్మడి జిల్లాలలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 6.22 లక్షల హెక్టార్లు, కాగా ఈ ఏడాది 6.35 లక్షల హెక్టార్లలో పంటలు సాగువుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి, వేరుసెనగ, కంది, మొక్కజొన్న, వరి, మినుము, ఉల్లి, మిరప, కొర్ర, జీలుగ, పిల్లి పెసర, తదితర ప్రధాన పంటలను రైతులు సాగు చేయనున్నారు.

వేరుశనగ రాయితీ విత్తన ధర రూ.5148..

జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ చేసేందుకు రాయితీ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వేరుసెనగ క్వింటా రూ. 8580 కాగా 40 శాతం రాయితీగా ఇవ్వనుంది. అంటే క్వింటా ధరపై రూ. 3432 పోను రైతులు రూ. 5148 చెల్లించాల్సి ఉంటుంది. అర ఎకరా ఉన్న రైతుకు 30 కిలోలు ఉన్న ప్యాకేట్‌ను, ఎకరా ఉన్న వారికి 2 ప్యాకేట్లను, ఎకరం పైబడి ఉన్న వారికి 3 ప్యాకేట్లు ఇవ్వనున్నారు. రాయితీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేసే క్రమంలో ఏపీసీడ్స్‌ సిద్దం చేస్తుంది. వివిధ విత్తన సంస్ధల నుంచి విత్తనం అందగానే రాయితీపై పంపిణీకి చేయనుంది. వేరుశనగ విత్తనం అవసరమైన రైతులు ముందుగా తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

3.15 లక్షల హెక్టార్లలో పత్తి సాగువుతుందని అంచనా..

జిల్లాలో గత ఏడాది 2.75 లక్షల హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. సాగుకు అనుగుణంగా జిల్లాలో పత్తి క్వింటా ధర రూ. 8వేల నుంచి రూ. 12వేల వరకు పలికింది. దీంతో ఈ ఏడాది దాదాపు 3 లక్షల హెక్టార్లలో పత్తి సాగువుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో 25 లక్షల బిటీ -2 పత్తి విత్తనాలు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా జిల్లాకు 35 లక్షల నుంచి 40 లక్షల పత్తి విత్తన ప్యాకేట్లు అవసరం అవసరం ఉంటుంది.

- Advertisement -

అందుబాటులో ఎరువులు..

రానున్న ఖరీఫ్‌కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏప్రెల్‌, మేతో కలుపుకొని సెప్టెంబర్‌ వరకు 1.25 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం అవుతుందని గుర్తించారు. డిఏపీ, సూపర్‌ పాస్పేట్‌, పోటాష్‌, ఎన్‌పీ కాంపెక్ల్సు, ఇతర ఎరువులు మేలో 21వేలు, జూన్‌లో 50వేలు, జూలైలో 59వేలు, ఆగస్టులో 76వేలు, సెప్టెంబర్లో 97వేలు మె ట్రిక్‌ టన్నులు అవసరం అవుతాయని వ్యవసాయ అధికారులు తేల్చారు. ఇప్పటికే జిల్లాలో 81,977 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. ఏపి మార్కుఫెడ్‌ , ఇతర సంస్ధల వద్ద ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 2022 ఖరీఫ్‌కు 3,07 లక్షల మె ట్రిక్‌ టన్నుల ఎరువులు కావాలని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. 2021 ఖరీఫ్‌లో 3,87 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎరువుల కోరత లేకుండా చూడనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్‌ బికేల వద్ద ఎరువులను అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement