Tuesday, December 5, 2023

KNL: శ్రీశైల దేవస్థానం నూత‌న‌ ఈవోగా డి.పెద్దిరాజు బాధ్యతల స్వీకరణ

శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన డి.పెద్దిరాజు సోమవారం తన పరిపాలన భవనంలో అధికార బాధ్యతలను స్వీకరించారు. పూర్వ కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న అధికార బాధ్యతలను వీరికి అప్పగించారు. కాగా ఉద్యోగ బాధ్యతల స్వీకరణకు ముందు వారు ఆలయంలో శ్రీశైల భ్రమరాంబిక శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను జరిపించారు. అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు మాట్లాడుతూ… శ్రీస్వామి అమ్మవార్ల అనుగ్రహంతో తనకు కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించిందన్నారు. శ్రీస్వామి అమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు. కార్యనిర్వహణాధికారి బాధ్యతల ద్వారా అటు స్వామి అమ్మవార్లను, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం తనకు లభించిందన్నారు.

- Advertisement -
   

గతంలో తాము ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది మొదలైన వారి సహకారంతో శ్రీశైల క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా గో సంరక్షణ, దర్మప్రచారం మొదలైన కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement