Tuesday, May 14, 2024

AP : కుప్పంలో అభివృద్ధి వైసీపీతోనే ..సీఎం జ‌గ‌న్‌

కుప్పం, (ప్రభన్యూస్) : చంద్రబాబు 35 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎంగా, మూడు విడతలుగా ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఎవరికైనా మంచి చేశాడా? ఇలాంటి వ్యక్తి కుప్పం ఎమ్మెల్యేగా అర్హుడా? అని ఏపీ సీఎం జగన్ ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించారు. సోమ‌వారం కృష్ణా జ‌లాల విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.20 లక్షల మందికి తాగునీరు, 6.300 ఎకరాలకు సాగునీరు అందించే అనంత వెంకటరెడ్డి సుజల స్రవంతి పథకంలో రూ.560.29 కోట్ల వయ్యంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్లో కృష్ణాజలాల విడుదల కార్యక్రమం నిర్వ‌హించారు.

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటలో కృష్ణాజలాలను విడుదల చేశారు. శాంతిపురం మండలం గుండుశెట్టి పల్లెలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు పాలనను సీఎం జగన్ తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, మీ బిడ్డ జగన్ 57 నెలల్లో అందించిన పాలనను, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకోవాలని కోరారు.

కుప్పంకు కృష్ణా జ‌లాల‌ను తీసుకొచ్చాం..
కుప్పం ప్రజలకు జీవనాడికృష్ణా నది జలాలను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉందని జ‌గ‌న్ అన్నారు. అదేవిధంగా కుప్పం అభివృద్ధికి తన ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఇందులో కుప్పం మునిసిపాలిటీ హోదా, కుప్పం రెవెన్యూ డివిజన్, కుప్పం లో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు తన ప్రభుత్వ హయాంలోనే జరిగిందని వివరించారు. రూ.66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతుందని తెలిపారు.నియోజకవర్గంలోని 4 మండలాల అభివృద్ధికి మరో రూ. 100 కోట్లు మంజూరు చేసి పనులు నిర్వహిస్తున్నారని అన్నారు. కుప్పం జలప్రదాయిని పాలారు ప్రాజెక్టు లో భాగంగా 0.6 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.215 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

అక్క చెల్లెమ్మ‌ల ఖాతాల్లో నేరుగా నిధులు..
కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఈ 57 నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని అందించిన లబ్ధి డీబీటీ రూ.1,400 కోట్లు కుప్పం లోని అక్క చెల్లమ్మ ల ఖాతాలో జమ చేశామని సీఎం జగన్ తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ -రూ.1,889 కోట్లు కుప్పం ప్రజల ఖాతాలో జమ చేశామన్నారు. తన పాలనలో లంచాలు లేవు, నిర్లక్ష్యం లేదు, నేరు ఇంటికే సంక్షేమ ఫలాలు అందాయని, మహిళ సాధికారిత కోసం చంద్రబాబు ఇచ్చింది సున్నా అన్నారు. కుప్పం నియోజకవర్గానికి ఆయన చేసిన మంచి పని ఒక్కటి లేదన్నారు.

బీసీల ఖాతాల‌ను క‌బ్జా చేసిన చంద్ర‌బాబు..
కుప్పం నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉంటే.. బీసీల ఇలాఖాను చంద్రబాబు కబ్జా చేశారని , చంద్రగిరి నుంచి జనం తరిమేస్తే కుప్పంలో తన ధన బలంతో బీసీల స్థానాన్ని ఆక్రమించాడని సీఎం జగన్ ఆరోపించారు. ఒక దత్తపుత్రుడితో కలిసి నాలుగు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని, మంచి చేస్తే పొత్తుతో పనేంటీ? వంగవీటి రాధాను చంపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ భరత్ బీసీ నాయకుడు, అతడిని గెలిపిస్తే మంత్రిని చేస్తాం అని జగన్ సభాముఖంగా హామీ ఇచ్చారు. ఎక్కడ నుంచో వచ్చి కుప్పంలో తిష్ట వేశాడని, ఒక్క ఇల్లు కట్టుకోలేదని, ఆయనకు కావాల్సింది ఎమ్మెల్యే పదవి మాత్రమేనని, కుప్పం ప్రజల సుఖశాంతులు కాదని సీఎం జగన్ విమర్శించారు.

2014 నుంచి ఒక్క‌టి ఇంటి ప‌ట్టా ఇచ్చారా..
కుప్పంలో 2014 నుంచి ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదని, ఇప్పటికి తన ప్రభుత్వం 15,721 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని, ఈ నెలలో మరో 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. అంటే 30 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఇప్పటికి 7,898 ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఇందులో 4,871 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని సీఎం జగన్ వివరించారు. కార్యక్రమం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement