Friday, April 26, 2024

మొన్న రెమిడిసివిర్.. నేడు ఆనందయ్య మందు.. కేటుగాళ్లకు ఇదే సంపాదన!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన అనందయ్య తయారు చేసిన నాటు మందు మంచి ఫలితాలు ఇవ్వడంతో దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో కొందరు ఆనందయ్య ఆయుర్వేద మందును బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ప్యాకేట్ కు 3 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రజల అవసరాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. క్యూలో పడిగాపులు కాసిన మందు దొరక్కపోవడంతో ప్రజలు బ్లాక్ లో కోనుగోలు చేస్తున్నారని తెలిసింది. కరోనా చికిత్సలో వాడుతున్న రెమిడిసివిర్ కొరతను కొందరు బ్లాక్ మార్కెట్లలో అధిక ధరలకు అమ్ముతున్న సంగతి తెలిసిందే. మూడు వేలు ఖరీదు చేసే రెమిడిసివర్ ఇంజక్షన్లను రూ.30-40 వేలకు బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇప్పుడు అనందయ్య మందుకు డిమాండ్ ఏర్పడడంతో కొందరు కేటుగాళ్ల దృష్టి ఈ మందుపై పడింది. కరోనా సమయంలో అక్రమ సంపాదనే ధ్యేయంగా రంగంలో దిగారు. కరోనా బాధితుల కోసం ఆనందయ్య తాను కనిపెట్టిన ఆయుర్వేద మందును ప్రజలకు ఉచితంగా అందిస్తుంటే… ఈ అక్రమార్కులు మాత్రం బ్లాక్ లో వేలకు వేలు వసూలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును ఆయుష్‌ శాఖ బృందం పరిశీలించింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు కృష్ణపట్నం వెళ్లిన బృందం మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ మందు పంపిణీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుపై శాస్త్రీయ నిర్థరణకు కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధన సంస్థకు చెందిన వైద్యుల బృందం కృష్ణపట్నం రానుంది.

కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డీజీతో మాట్లాడారు. అధ్యయనం చేసి త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధరణ చేయించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో ఆయుష్ కమిషనర్, అధికారులు కృష్ణపట్నంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. ఆనందయ్య మందు తయారుచేస్తున్న వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాత్రి కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో బృంద సభ్యులు మాట్లాడారు. ఆయుర్వేద మందుకు సంబంధించిన పరీక్షలు కొన్ని పూర్తి కావాల్సి ఉందన్నారు. అప్పటివరకు పంపిణీ నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధనకు చెందిన వైద్యుల బృందం కూడా సోమవారం కృష్ణపట్నం వస్తుందని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ తెలిపారు.

కృష్ణపట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ఇవాళ నిలిపివేశారు. ఈ మందుపై ఐసీఎంఆర్​తో కలిసి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ మందు తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని వాడిన వారు ఆయుష్ బృందానికి తెలిపారు. ఈరోజు మందు తయారీ విధానాన్ని ఆనందయ్య ప్రభుత్వానికి చూపించనున్నారు. తదనంతరం దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి జనం తండోపతండాలుగా రావటంతో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఐసీఎంఆర్‌ నివేదిక తర్వాతనే మళ్లీ మందు పంపిణీ ఉంటుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. మరోవైపు ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు.

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా సెంకడ్ వేవ్ విలయతాండం చేస్తున్న వేళ నెల్లూరులోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కొన్ని రోజులుగా జనం బారులు తీరుతున్నారు. దాదాపు 20 రోజులుగా ఆనందయ్య ఈ మందును ఉచితంగా కరోనా రోగులకు అందిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలివచ్చారు. ఎమ్మెల్యే కాకాణి కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రజలు ఎగబడ్డారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. క్యూలైన్‌ లలో స్వల్ప తోపులాట కూడా జరిగింది. కొందరు అంబులెన్సుల్లో కరోనా రోగులను కృష్ణపట్నానికి తీసుకువచ్చారు. గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం నుంచి పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు ఇచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తారని చెప్పడంతో ప్రజలు ఆందోళన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement