Tuesday, May 7, 2024

పట్టణ ప్రజల…గొంతు తడిసేనా?

వేసవి వచ్చేసింది.. మంచినీటి ఇబ్బంది ఎక్కడా ఉండకూడదు. దాహం కేకలు వినిపించకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఆచరణ విషయానికి వస్తే మచ్చుకైన కనిపించదు. ఇందుకు ఉదాహరణ గుడివాడ పట్టణ పంపుల చెరువు. ఈ చెరువుకు గండి పడి రెండు నెలలు అయింది. ఐదు అడుగుల మేర నీరు వృథాగా పోయింది. పాత పంపుల చెరువులో 12 అడుగులు ఉండవలసిన నీరు 5 అడుగులకు చేరింది. గండి పడిన చెరువుకు మరమ్మతులు చేయవలసిన అధికారులు పరిశీలన వరకే పరిమితమయ్యారు. వేసవి రానే వచ్చింది. ఇప్పటికే ఒక్కపూట మంచినీరు సరఫరా చేస్తున్నారు. వేసవిలో ఈ నీరు కూడా అందుతుందో లేదోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కమిషనర్‌ను వివరణ కోరగా తాత్కాలిక మరమ్మతులకు రూ.36 లక్షలు అవుతుంది.. రూ.కోటి పెట్టి పూర్తి మరమ్మతులు చేస్తామంటున్నారు. పూర్తి మరమ్మతులు ఇంకెప్పుడు చేస్తారు? ఈ ఏడాది గొంతు ఎండక తప్పదంటున్నారు పట్టణ ప్రజలు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన గండికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని, వేసవి కాలంలో పూర్తి స్థాయిలో తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై మునిసిపల్‌ కమిషనర్‌ సంపత్‌ కుమార్‌ ను వివరణ కోరగా చెరువుకు గండి పడిన ప్రాంతంలో తత్కాలిక పనులకోసం రు.36 లక్షలకు టెండర్‌ పిలవడం జరిగిందని అన్నారు. అయితే తాత్కాలిక మారమ్మతులకే 36 లక్షలు పెట్టడం దేనికని, పూర్తి స్థాయి మరమ్మతులకోసం కోటి రూపాయలతో ప్రతి పాదనలు సిిద్ధం చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది చెరువును ఎండ పెట్టామని సిల్ట్‌ లేకపోవడం వలన నీరు పెట్టడం జరిగిందన్నారు. ఈ నెల 15వ తేదీలోగా చెరువుల్లో నీటిని నింపుకోవాలని ప్రకటించారు కదా అని ప్రశ్నించగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం ఒక్కపూట నీటిని సరఫరా చేస్తున్నామో అలాగే ఒక్కపూటే నీటిని సరఫరా చేస్తామని సమాధానం ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement