Thursday, May 16, 2024

రైతులకు ఖరీఫ్‌ కష్టాలు! డీఏపీకి కరువు.. ఆర్బీకేల్లో నో స్టాక్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఖరీఫ్‌ సీజన్‌లో అదునులో వాడాల్సిన అత్యవసర ఎరువు డి-అమోనియం ఫాస్పెట్‌ (డీఏపీ) ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్‌కు సరిపడా డీఏపీ నిల్వలు లేకపోవటం, రైతు భరోసా కేంద్రాల్లోనూ స్టాకు లేకపోవటంతో బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఖరీఫ్‌ లో వరి పండించే అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వానికి డీఏపీ కేటాయింపుల మేరకు దశల వారీగా కేంద్రం పంపిస్తున్న సరుకు వచ్చిందే తడవు ఆర్బీకేల నుంచి రైతులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో డీఏపీ వచ్చిన మరుసటి రోజు నుంచే నిల్వలు పూర్తిగా అడుగంటు-తున్నాయి. డీఏపీ ఉత్పత్తిని కంపెనీలు తగ్గించటం వల్ల ఉన్న నిల్వలనే వివిధ రాష్ట్రాల్రకు తక్కువగా పంపిస్తున్నారు. ఫలితగా డీఏపీకి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన డీఏపీ బస్తా గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌ పీ) 1350 రూపాయలుండగా బహిరంగ మార్కెట్లో కనీసం 1500 రూపాయలకు తక్కువ కాకుండా అమ్ముతున్నారు. బిల్లును మాత్రం ఎమ్మార్పీ ధరకే ఇస్తున్నారు. అధిక ధరలకు విక్రయించమే కాకుండీ డీఏపీ కావాలంటే మరికొన్ని అనుబంధ ఎరువులను కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని కొందరు డీలర్లు అనధికారికంగా షరతు పెడుతున్నారు. దీంతో రైతులకు అవసరం లేకున్నా కొన్ని ఎరువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీని వల్ల ఒక వైపు ఆర్ధిక భారంతో పాటు మరో వైపు మార్కెట్లో ఉన్న నిల్వలు కూడా అడుగంటంతో డీఏపీని అంత తేలిగ్గా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించటం లేదని రైతులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌ పరిధిలో సాగునీటి సౌలభ్యం పూర్తిస్థాయిలో అందుబాటు-లోకి రావటంతో వరి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో వైపు నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల కింద కూడా ఈ ఏడాది ముందుగానే వరి సాగు మొదలైంది. ఇపుడు అదునులో డీఏపీని వినియోగించాల్సిన అవసరం ఏర్పడినా మార్కెట్లో లభ్యత లేకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాయితీ ఎక్కువ.. ధర తక్కువ

డీఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎక్కువ..మార్కెట్లో లభించే ఇతర ప్రత్యామ్నాయ ఎరువులతో పోలిస్తే ధర కూడా తక్కువ. కేంద్ర ప్రభుత్వం కూడా డీఏపీ వినియోగాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతులు డీఏపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫాస్పేట్‌ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వాటిని సర్టిఫైడ్‌ కంపెనీలకు సరఫరా చేసి డీఏపీతో పాటు- ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను తయారు చేస్తోంది. కంపెనీల అందించే ఉత్పత్తిని వివిధ రాష్ట్రాల్రు తమ అవసరాల మేరకు అందించిన ఇండెంట్‌ ఆధారంగా కేటాయింపులు చేస్తోంది. ఈ ఏడాది డీఏపీ డిమాండ్‌ ను బట్టి ఆర్బీకేల స్థాయిలో నిల్వలను ఉంచుకోవటంలో అప్రమత్తంగానే వ్యవహరించినా సాగునీటి సౌలభ్యంతో వరి సాగు అన్ని ప్రాంతాల్లో ముమ్మరం కావటంతో పంపిణీ ప్రణాళిక దెబ్బతిందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మాత్రం డీఏపీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. డీఏపీ అందుబాటులో లేకపోతే 20.20.0.13 తోపాటు 10.26.26 కాంపెక్స్‌ ఎరువులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని సూచిస్తోంది. ఫాస్పేట్‌తో పాటు యూరియా, సల్ఫర్‌ ఉన్న కాంప్లెక్స్‌ ఎరువులు వరిసాగుకు డీఏపీ స్థాయిలోనే ఉపయోగపడతాయి..అంతేకాకుండా ఆగస్టు నెల ప్రణాళికను అనుసరించి లోటుగా ఉన్న డీఏపీ త్వరలో రాష్ట్రాన్రికి వచ్చేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement