Sunday, May 19, 2024

స‌రిహ‌ద్దుల‌లో క‌ర్నాట‌క కౌంట్ డౌన్ – త‌నిఖీలు ముమ్మ‌రం..

అమరావతి, ఆంధ్రప్రభ: కర్నాటకలో పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈనెల 10వ తేదీన అక్కడ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో మన రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పోలీసు శాఖ దృష్టి సారించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌, డీజీపీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమావేశానికి మన సీఎస్‌ కె జవహర్‌రెడ్డి, డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కర్నాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు జిల్లాల పోలీసు యంత్రాంగానికి దిశా నిర్ధేశం చేసింది. దీనికి తోడు రాష్ట్రం నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను అక్కడ ఎన్నికల విధులకు కేటాయించారు. పోలీసులతోపాటు రెవిన్యూ అధికారులు, సిబ్బంది కూడా వెళ్లనున్నారు. వీరిలో పలువురు ఐఏఎస్‌ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే కొన్ని బలగాలు అక్కడ విధుల్లో చేరగా, మరి కొన్ని బలగాలు నేడు, రేపు తరలివెళ్లనున్నాయి. కర్నాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని అక్కడి నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ఏపీ వైపు నుంచి అధికార యంత్రాంగం గత వారం రోజుల నుంచే ప్రత్యేక భద్రతా చర్యలు కొనసాగిస్తోంది.

ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిషేధాఙ్ఞలు అమలు చేస్తోంది. కర్నాటకకు ఆనుకుని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, అన్నమయ్య, నంధ్యాల జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాలు అనంతపురం రేంజ్‌ పరిధిలోకి వస్తాయి. దీంతో ఆయా జిల్లాల ఎస్పీలతో అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరె డ్డి సరిహద్దు ప్రాంతాల పరిధిలోని అధికారులతో నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచీ ఎన్నికల నిబంధనలు పూర్తి స్ధాయిలో అమల్లోకి రానున్నాయి. సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఓటర్లను ప్రలోబపరిచేందుకు మద్యం, నగదు, ఇతర బహుమతులు, సామాగ్రిని సరిహద్దు మార్గాల ద్వారా కర్నాటకకు వెళ్ళకుండా నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కర్నాటకలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి మద్యం నిషేధం ఉంటుంది. దీంతో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాగం మద్య నిషేధం అమలు చేయనుంది. ఇందుకోసం 43 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు తనిఖీలు, చెక్‌పోస్టుల ఏర్పాటుకు ఆస్కారం లేని చోట్ల నిరంతరం పెట్రోలింగ్‌ పార్టీలు సంచరిస్తున్నాయి. కర్నాటక నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలు, రాకపోకలపై ఎస్‌ఇబి దృష్టి పెట్టింది. ఏపీ నుంచి కర్నాటకలోకి ప్రవేశించే మార్గాల్లో రాకపోకలపై పోలీసు యంత్రాంగం తనిఖీల బాధ్యతను నిర్వహిస్తోంది.

బోగస్‌ ఓటర ్లపై ఫోకస్‌..
కర్నాటక పోలింగ్‌లో బోగస్‌ ఓటర్ల హవాను నియంత్రించేందుకు మన రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి వలస వెళ్ళిన అనేక మందికి అక్కడ, ఇక్కడ రెండు చోట్ల ఆధార్‌ కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా అక్కడి నాయకుల వద్ద సరిహద్దు ప్రాంతాలకు చెందిన అనేక మంది పని చేస్తున్నారు. దీంతో వీరంతా పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు గురి ్తంచిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ రోజున అల్లర్లు సృష్టించేందుకు, దొంగ ఓట్లు షురూ చేసేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సరిహద్దులో తల దాచుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. దీంతో కదిలి న యంత్రాంగం లాడ్జిలు, అనుమానాస్పద ప్రదేశాలను తనిఖీలు చేస్తున్నారు. కర్నాటక వైపు వెళ్ళే వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓటు కోసం వెళ్తున్నారా.. ఏం పని మీద వెళ్తున్నారు. ఏ కారణం లేకుండా ఎందుకు వెళ్తున్నారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

ఆయుధాలు స్వాధీనం..
ముఖ్యంగా పోలింగ్‌ సందర్భంగా అల్లర్లు సృష్టించే అవకాశమున్న వ్యక్తుల జాబితాను పోలీసులు సేకరించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న వారిపై దృష్టి పెట్టి తనిఖీలు చేస్తు.. మరోవైపు గన్‌ లైసెన్స్‌ కలిగిన వారి నుంచి 517 తుపాకీలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చాలా మంది నుంచి తుపాకులు డిపాజిట్‌ చేయించారు. అవి ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. మరికొందరి నుంచి స్వాధీనం ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వివిధ కేసుల్లో ప్రమేయం ఉండి, అదీకూడా ఎన్నికల కేసుల్లో ఉన్న వారిపై పెండింగ్‌లో ఉన్న 748 వారెంట్లు అమలు చేశారు. అట్టివారిని అదుపులోకి తీసుకుని వారెంట్‌ అమలు చేయడం, బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. బ్యాంకులు, సెక్యూరిటీ సంస్ధలకు సంబంధించి లైసెన్స్‌ తుపాకీలకు మినహాయింపు ఇచ్చారు.

- Advertisement -

నగదు, మద్యం రవాణాపైనే దృష్టి..
ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ప్రధానంగా యంత్రాంగం సరిహద్దులో నగదు, మద్యం రవాణాపైనే దృష్టి పెట్టింది. మొత్తం 44 మండలాల పరిధిలోని 47 పోలీసు స్టేషన్లు, 19 ఎస్‌ఇబి స్టేషన్లు, అంతంాష్ట సరిహద్దుల్లో 57 సమీకృత చెక్‌ పోస్టుల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. కర్నాటకలోని చిత్రదుర్గ, బళ్ళారి, రాయచూరు, చుండూరు, కోలార్‌, చిక్‌ బళ్ళాపుర తదితర ప్రాంతాలు మనకు సరిహద్దులో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.12,66,55,614 కోట్ల విలువైన మద్యం, సారా, నగదు, ఇతర ప్రలోభాలను సీజ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement