Sunday, April 28, 2024

కల్తీసారా, మద్యంపై టీడీపీ ఉద్యమం.. ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభం

అమరావతి, ఆంధ్రప్రభ : కల్తీసార, నాసిరకం మద్యం విక్రయాలపై టీడీపీ పోరును మరింత ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మద్యం మాఫియాపై చేస్తున్న పోరాటంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. శనివారం ఈ వెబ్‌సైట్‌ను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పార్టీ మహిళా నేత ఆచంట సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం పాలసీ, మద్యం పేరుతో సాగుతున్న దోపిడీ, మరణాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు ప్రభుత్వమే చేస్తుందని గతంలో ఇచ్చిన మద్య నిషేధ హామీని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

జంగారెడ్డిగూడెంలో నాటుసారాకు 27 మంది బలైతే వాటిని ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించిందని దుయ్యబట్టారు. సారా మరణాలుగా పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్న అసెంబ్లి సాక్షిగా అవాస్తవాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లిd సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్యత్వాన్ని దెబ్బతీస్తున్నారని, కోర్టు తీర్పులను అవహేళన చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు. ఇది రాజ్యాంగానికి అవమానించడమేనని దుయ్యబట్టారు. తప్పులు ఎత్తిచూపితే కోర్టులపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారన్న విషయాన్ని జగన్‌ గుర్తుంచుకోవాలన్నారు. మద్యం మాఫియా వల్ల జరుగుతున్న అనర్థాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement