Sunday, April 28, 2024

Kakumanu- బురద మట్టిలో మహా ఖననం .. గుండెల్ని పిండిన అంత్యక్రియలు

కాకుమాను, ప్రభన్యూస్ (గుంటూరు జిల్లా) – గుంటూరు జిల్లా కాకుమాను మండలం పరిధిలోని దళిత పల్లెలు అల్లాడిపోతున్నాయి. తన రక్త సంబధీకుల అంత్య క్రియలతో తుదివీడ్కోలు పలికేందుకు నానా అవస్థలు పడుతున్నారు. . చాలీచాలని స్థలాల్లో దశాబ్దాల తరబడి దళితులు తమ బంధువుల మృతదేహాలను ఖననం చేస్తున్నారు. దీంతో పాత సమాధులను తవ్వి కొత్త మృత దేహాలను పెట్టెల్లో పూడ్చుతున్నారు. ఈ సమస్య కేవలం కాకుమాను మండలంలోనే కాదు.. యావత్ ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. అదనంగా ఎంతో కొంత భూములు కేటాయించి, వాటిని మెరక చేయించాలని ప్రభుత్వాలను కోరినప్పటికీ పట్టించుకోవటం లేదు

తాజాగా ఇలాంటి సమస్య మండల కేంద్రం కాకుమానులో ఎదురైంది. కాకుమాను గ్రామంలో ఓ దళిత కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందగా దళితుల స్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. తుపానుతో కురిసిన భారీ వర్షం కారణంగా.. నీరు మోకాళ్ల లోతులో నిల్వ ఉన్నాయి. స్మశాన స్థలం పల్లంగా ఉండడంతో నీరు ఎటూపోలేని దుస్థితి ఏర్పడింది.
దీంతో పొక్లెయిన్ రప్పించి మోకాళ్లలోతు నీటిలోనే గొయ్యి తవ్వి చుట్టూ కట్ట కట్టారు. గోతిలో చేరిన నీటిని ఇంజనుతో బయటకు తోడి పోశారు. ఆ తర్వాత మృతదేహం పెట్టెను గోతిలో దింపి బురద మట్టితోనే పూడ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితుల స్మశానవాటికలకు అదనంగా స్థలాలు కేటాయించి, మెరక తోలించిప్రహరీ గోడలు నిర్మించాలని, రహ దారులను బాగు చేయించాలని కాకుమాను దళిత జనం చేతులు జోడించి వేడుకొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement