Sunday, April 28, 2024

Kadapa: లోక్ అదాలత్ తో సత్వర సేవలు.. స్వర్ణ ప్రసాద్

కడప ప్రతినిధి, జనవరి 20 ( ప్రభన్యూస్) :సేవా రంగాలలో లోపాలకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ప్రజా ప్రయోజిత న్యాయ సేవల అవగాహన కార్యక్రమం శనివారం యోగి వేమన విశ్వవిద్యాలయం నూతన పరిపాలన భవనంలోని తాళ్లపాక అన్నమాచార్య సెనేట్ హాలులో నిర్వహించారు. వై వి యు లీగల్ సెల్, నోడల్ ఆఫీసర్ డా. ఆర్.వి.జయంత్ కశ్యప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పి జి కళాశాల ప్రధానాచార్యులు ఎస్ రఘునాథ్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ స్వర్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడు న్యాయం పొందే హక్కు కల్పించిందన్నారు. అందులో భాగంగా అవసరమైన ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించేందుకు శాశ్విత లోక్ అదాలత్ పనిచేస్తుందని ఇక్కడ లభించే తీర్పు సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమానమని, తీర్పు వెలువడ్డాక పైకోర్టుకు అప్పీల్ అనేది ఉండవని స్పష్టం చేశారు. రూ.కోటి విలువ గల వివాదాలు ఇక్కడ ప్రజాప్రయోజిత సేవ రంగాలకు సంబంధించి రవాణా, సమాచార, విద్యుత్, నీటి సరఫరా, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ప్రజా సేవలు, ప్రజారోగ్యం, బీమా సౌకర్యాలు, విద్యాసంస్థలు, స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి హామీ, బ్యాంకుల సేవా లోపాలు ఎదురైనప్పుడు పర్మనెంట్ లోకాదాలత్ సత్వర సేవలు పొందవచ్చన్నారు. 90 రోజుల్లో బాధితులకు స్వాంతన కలిగిస్తామని, గతంలో వెలువడిన తీర్పులను ఉదహరిస్తూ అవగాహన కల్పించారు. హిందూ వారసత్వ చట్టం- 1956 ద్వారా కూతుర్లకు కూడా ఆస్తి హక్కు ఉందని వివరించారు.


ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ మాట్లాడుతూ… న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా న్యాయస్థానాలను ఆశ్రయించాలంటే చట్టాల పట్ల అవగాహన పొందాలన్నారు. ఇలాంటి వేదికలు దోహదపడతాయన్నారు. నిరంతర, మొబైల్, రోజువారీ, జాతీయ, మెగా శాశ్వత లోక్ అదాలత్‌ల ద్వారా బాధిత ప్రజలకు సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం న్యాయపరమైన సందేహాలను చైర్మన్ దృష్టికి తీసుకురాగా న్యాయపరంగా సూచనలు, సలహాలు అందజేశారు.

- Advertisement -

వైవీయూ కులసచివులు ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ… కార్యక్రమ నిర్వహణ సమన్వయ బాధ్యతను వైవియూ కు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ లీగల్ సెల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ వి జయంత్ కశ్యప్, లోక్ అదాలత్ కార్యాలయ సహయకులు సయ్యద్ సాహేబ్, వైవీయూ అధ్యాపకులు, విద్యార్థులు, స్కాలర్లు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement