Saturday, May 18, 2024

ప్ర‌జ‌ల‌లో విశ్వ‌స‌నీయ‌త పెంచేదెలా?…జ‌గ‌న్ క్యాబినేట్ లో అంత‌ర్మ‌ధ‌నం

అమరావతి, ఆంధ్రప్రభ: సంక్షేమం.. పెట్టుబడుల ఆకర్షణ.. పరిశ్రమలకు అనువైన వాతావరణం.. ఉపాథి కల్పన.. ఖరీఫ్‌ లో రైతులకు ప్రాధాన్యత అంశాలే అజెండాగా బుధవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మరింత జవాబుదారీ పెంచే విధంగా ‘జగనన్నకు చెబుతా’ కొత్త కార్యక్రమానికి రూపకల్పన జరుగుతోంది. ఈ కేబినెట్‌లో కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.. గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే మెజారిటీ వినతులను గుర్తించి ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి వరకు సమస్య పరిష్కారమయ్యే దిశగా యంత్రాంగాన్ని జాగృతం చేసే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి టోల్‌ ఫ్రీ నెంబరు కూడా సిద్ధం చేస్తున్నారు..

సంక్షేమ పథకాలు అందని వారిని ఏ కారణంగా తిరస్కరించారనే విషయమై పూర్తి వివరాలను సీఎంఓకు సైతం అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌ వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. స్పందనకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థ ను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం జరిగే కేబినెట్‌ సమావేశపు అజెండాపై సోమవారం ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆంతరంగికంగా చర్చించారు. ప థకాల అమలులో మరింత పారదర్శకతను అమలు చేయాల్సిిందే అని సీఎం జగన్‌ ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా పరిశ్రమలు..పెట్టుబడుల ఆకర్షణకు అనుసరించాల్సిన వ్యూహంతో పాటు వచ్చేనెల 3,4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌, 29,30 తేదీల్లో జరిగే జీ-20 సదస్సులను విజయవంతం చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సంక్షేమం.. అభివృద్ధి.. ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది.
దీంతో పాటు శాసనససభ బడ్జెట్‌ సమావేశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వచ్చేనెల 3,4 తేదీల్లో విశాఖ సమ్మిట్‌ తరువాత 5వ తేదీన ఆదివారం అయినందున 6 నుంచి అసెంబ్లిd సమావేశాలు నిర్వహించే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. బడ్జెట్‌ సమావేశాలను సెలవులు పోగా కనీసం 15 రోజులు నిర్వహించాలని భావిస్తున్నారు. సుప్రీం కోర్టులో మూడు రాజధానులపై విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు పర్యవసానాలను ద ృష్టిలో ఉంచుకుని శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు నిర్వహించే యువజన సదస్సులకు చెక్‌ పెట్టేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల వివరాలతో పాటు యువజనాభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు.. భోగాపురం విమానాశ్రయం, పోర్టుల అభివృద్ధి.. కడప ఉక్కు కర్మాగారం తదితర అంశాలను కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.
ప్రభుత్వం వలంటీర్లతో సహా క్షేత్రస్థాయి పర్యవేక్షణకు గృహసారథులను నియమిస్తోంది.. వీరంతా సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు నివేదిక అందించటంతో పాటు ప్రతి గ్రామం నుంచి వచ్చే ఫిర్యాదుల్లో 50 వరకు ఒకే సమస్యపై వచ్చే వాటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై విశ్వసనీయతను పెంచాలనేదే ప్రధాన లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్‌ ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నారు. ఇంకా జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల పంపిణీపై కేబినెట్‌ భేటీలో విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement