Thursday, May 2, 2024

Big story | ఇప్పట్లో ప్రయివేట్‌ ట్రైన్లు లేనట్లే.. ఏడాది క్రితమే టెండర్ల ప్రక్రియ రద్దు

అమరావతి,ఆంధ్రప్రభ: భారత రైల్వేలలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయివేట్‌ రైళ్లకు తెరలేపింది. 109 ప్రధాన రూట్లలో 151 ట్రైన్లను ప్రయివేట్‌ వారు నడిపేలా, అందుకు గానూ వారు 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ప్రణాళిక రూపొందించింది. దీంతో భారత రైల్వే సేవల్లో భారీ మార్పులు రాబోతున్నాయని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్లుగానే దేశ, విదేశీలకు చెందిన 14 కంపెనీలు ఆసక్తి చూపించాయి. తీరా టెండర్లను పిలిచిన తర్వాత రెండు కంపె నీలు తప్ప మిగిలిన కంపెలన్నీ వెనక్కి తగ్గాయి. ఆ రెండు కంపెనీల్లోనూ ఒకటి భారత రైల్వేకే చెందిన ఐఆర్‌సిటిసి కాగా, మరో సంస్థ మెఘా ఇంజనీరింగ్‌. దీంతో సరైన స్పందన రాలేదని ఏడాది క్రితమే ఈ టెండర్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రయివేట్‌ కంపెనీలను మరింతగా ఆకర్షించేలా తిరిగి టెండర్లను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇప్పట్లో ప్రయివేట్‌ ట్రైన్లు రావు

మొదట అనుకున్న ప్రకారం 2023-24 నాటికి 12 ప్రయివేట్‌ ట్రైన్లను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2024-25లో 45 ట్రైన్లు, 2025-26లో 50 ట్రైన్లు మిగిలిన 44 ట్రైన్లు 2026-27 నాటికి అందుబాటులోకి రావాలని నిర్ణయించారు. అయితే షెడ్యూల్‌ ప్రకారం టెండర్‌ ప్రక్రియ జరిగి ఉండి అన్ని సవ్వంగా సాగిఉంటే ప్రయివేట్‌ ట్రైన్లు వచ్చి ఉండేవి. అయితే టెండర్లకు సరైన స్పందన రాకపోవడంలో మొత్తం టెండర్‌ ప్రక్రియనే రద్దు చేశారు. మొత్తం టెండర్‌ ప్రక్రియను రివాల్యూయేట్‌ చేసి మళ్లిd కొత్తగా టెండర్లు ఇస్తామని గత ఏడాది డిసెంబర్‌లో రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్టవ్‌ లోక్‌సభకు తెలిపారు. అయితే ఇంతవరకు టెండర్‌ ప్రక్రియను ప్రారంభించలేదు. దీంతో ఇప్పట్లో ప్రయివేట్‌ ట్రైన్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

- Advertisement -

మరిన్ని రాయితీలు కోరుతున్న ప్రయివేట్‌ కంపెనీలు

మొదట్లో ఇచ్చిన టెండర్‌ ప్రక్రియ ప్రకారం ప్రయివేట్‌ కంపెనీలే రైళ్లు నడపడానికి కావాల్సిన అన్నింటినీ అంటే ఫైనాన్సింగ్‌, ప్రొక్యూరింగ్‌, అపరేటింగ్‌, మెయింటెనింగ్‌ చేసుకోవాల్సి ఉంది. రైలు పెట్టేల్లో 70 శాతం రేకులను భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంది. ఇందుకు గాను భారత రైల్వే శాఖ ప్రయివేట్‌ ఆపరేట్లకు 35 ఏళ్ల పాటు ఆదాయంలో కన్సెషన్‌ ఇస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలు ప్రయివేట్‌ కంపెనీలకు నచ్చలేదు. ఈ నిబంధనలు ప్రకారం నడిపితే నష్టాలు వస్తాయని వారు భావించారు. ముఖ్యంగా ఇతర దేశాల్లో అన్ని చోట్ల ప్రయివేట్‌ రైళ్లు నడిపిన సంస్థలు నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఒక వైపున భారత రైల్వేలో టిక్కెట్‌ రేట్లు చాలా తక్కువగా ఉండగా, ఆ రైళ్లలో పోటీపడి ప్రయివేట్‌ రైళ్లను నడపడం సాధ్యం కాదని ప్రయివేట్‌ కంపెనీలు అంటున్నాయి. రైల్వేలతో లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఉండాలని ప్రయివేట్‌ కంపెనీలు కోరుతున్నాయి. అటువంటి సందర్భంలో మాత్రమే తాము రైళ్లను నడపగలని తెగేసి చెబుతున్నాయి.

ప్రజలపై భారం తప్పదంటున్న ఉద్యోగ సంఘాలు

ప్రయివేట్‌ కంపెనీలు కోరుతున్నట్లు మరిన్ని రాయితీలు ఇస్తే ప్రజలపైన మరింత భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ పేరుతో భారత రైల్వే ట్రయిన్లలోనూ టిక్కెట్‌ ధరలు పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత రైల్వేలు ప్రయాణీకుల కు టిక్కెట్‌ ధరలపై దాదాపు 45 శాతం సబ్సిడీ ఇస్తోంది, ప్రయివేటీకరణ జరిగితే ఆ సబ్సిడీని ఎత్తేస్తారని, ఆ మేరకు ప్రజలపై భారం పడుతుందని రైల్వే ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ నరిసింహులు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే న్యూఢిల్లి-లక్నో మధ్య తేజాస్‌ అనే ప్రయివేట్‌ రైలును ఐఆర్‌సిటిసి నడుపుతోంది. ఢిల్లిd నుండి లక్నోకు ఈ రైల్లో ఎసి ఛైర్‌ కార్‌కు 1736 రూపాయల ఛార్జీని వసూలు చేస్తున్నారు. అదే భారత రైల్వేకు చెందిన ట్రయిన్‌లలో అయితే ఈ క్లాసుకు కేవలం 897 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. అంటే ప్రయివేట్‌ ట్రయిన్‌ కాబ ట్టే డబుల్‌ రేట్లను ప్రయాణీకులు చెల్లించాల్సి వస్తోంది. రైల్వేలో ప్రయివేటీకరణ సాగితే ఈ విధంగానే ప్రజలపై భారాలు పడే అవకాశముందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement