Monday, April 29, 2024

పోలవరం ఎత్తు కుదించారన్నది పచ్చి అబద్దం.. అంబటి రాంబాబు

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్లు 41.15కు ఎత్తు కుదించారన్నది పచ్చి అబద్ధమని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో ప్రజలను జగన్‌ సర్కార్‌ మోసం చేస్తోందని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించిన విషయం విదితమే.. అయితే ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చారు అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు సంతకాలు చేశారని చేసిన తన వ్యాఖ్యలను నాదెండ్ల నిరూపిస్తే తానే స్వయంగా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు తీసుకుని వెళ్తానన్నారు.. గొడవ చేయటానికి వెళ్తే పోలవరం ప్రాజెక్టు దగ్గరకు ఎందుకు అనుమతిస్తాం ? అని ప్రశ్నించారు.

ఇంతకు ముందు చంద్రబాబు రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి గొడవ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిన విషయం తెలియకే 2022 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. గతంలో ఇరిగేషన్‌ శాఖా మంత్రిగా ఉన్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రకటించారని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ఎత్తు తగ్గిస్తామని అధికారులు సంతకాలు పెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పాడు.. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను సవాల్ చేస్తున్నాను.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికపైనే చెప్పారు.. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement