Saturday, May 4, 2024

ప్రైవేట్‌ రాకెట్ల ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు.. ఈ నెల 12 నుంచి 16 మధ్య విక్రమ్‌-ఎస్‌ ప్రయోగం

సూళ్లూరుపేట (శ్రీహరికోట), ప్రభన్యూస్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పటికే విశ్వ వినువీధుల్లో దూసుకెళ్తున ఇస్రో అంతరిక్ష ప్రయోగాలలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరిచింది. ఇస్రో ప్రయోగ వేదికల నుంచి ప్రైవేటు రాకెట్ల ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అంతరిక్ష వాణిజ్య ప్రయోగాలలో దూసుకుపోతున్న ఇస్రో ఈ సారి మరో చారిత్రక నిర్ణయం తీసుకుని సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఈ ప్రయోగానికి శ్రీహరికోట సతీష్‌థావన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదికవుతోంది. దేశంలో ప్రైవేట్‌ రంగ రాకెట్‌ ప్రయోగాలకు సిద్దమైంది. ఈ క్రమంలో అభివృద్ది చేసిన మొట్టమొదటి రాకెట్‌ “విక్రమ్‌ -ఎస్‌’ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ నెల 12 నుంచి 16వ తేదీల మధ్య ఈ ప్రైవేట్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఇస్రో చేపట్టనున్న ఈ కొత్త ప్రయోగానికి ప్రారంబ్‌ మిషన్‌ అని నామకరణం చేశారు. విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీ అభివృద్ది చేసింది. ప్రైవేట్‌ రంగంలో రాకెట్‌ను అభివృద్ది చేసి ప్రయోగిస్తుండడం దేశంలో ఇదే మొదటి సారి. దీంతో ఈ ప్రయోగంపై విశ్వ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. తొలి ప్రైవేట్‌ ప్రయోగం విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇందులో విద్యార్థులు తయారు చేసిన 2.5 కిలోల పేలోడ్‌ సైతం ఉంది. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని తయారు చేశారు. దేశంలో అంతరిక్ష సాంకేతిక నూతన సంస్థలకు ప్రోత్సాహం, నియంత్రణలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్‌ – స్పేస్‌ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది.

ప్రైవేట్‌ విక్రమ్‌ -ఎస్‌ రాకెట్‌ ప్రయోగానికి ఇన్‌-స్పేస్‌ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌ లభించింది. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ నెల 12 నుండి 16 తేదీలలో ప్రయోగం జరగనుంది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్‌ రాకెట్‌ను డెవలప్‌ చేస్తోంది. విక్రమ్‌ -1 రాకెట్‌ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్‌ -2 బరువు 595 కిలోలు, విక్రమ్‌ -3 బరువు 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement