Friday, May 17, 2024

పెరిగిన పత్తి విస్తీర్ణం.. రాష్ట్రవ్యాప్తంగా 16.5 లక్షల ఎకరాల్లో సాగు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. 2022-23 సీజన్‌ లో రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణాన్ని 14.73 లక్షల ఎకరాలుగా నిర్దారించగా సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టినట్టు- అంచనా. అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్‌ సీజన్‌ లో 6,53,150 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగయింది. గత ఏడాది ఖరీఫ్‌ లో 4,99,512 హెక్టార్లలో సాగవుగా ఈ సీజన్‌ లో 53 వేల హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15 సంవత్సరంలో 16.35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేపట్టగా ఏడేళ్ళ తరువాత ఆ రికార్డును ఈ ఏడాది రైతులు బ్రేక్‌ చేశారు.

బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటంతో పాటు రాయలసీమలో వేరుశెనగకు బదులు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల పత్తి సాగు చేపట్టటం విస్తీర్ణం పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఖరీప్‌ లో పత్తి సాగుకు వాతావరణం అనుకూలంగా మారటంతో విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. దాదాపు ఇదే విస్తీర్ణం సాగు చేసినపుడు 2014-15లో 15 లక్షట టన్నుల దిగుబడి రాగా ఈ ఏడాది సుమారు 18 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. సీజన్‌ పూర్తయ్యే నాటికి దిగుబడి 20 నుంచి 21 లక్షల టన్నులకు చేరువ కావచ్చని అధికారులు భావిస్తున్నారు. పత్తి సాగును అత్యధికంగా చేపట్టే కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎకరాకు గరిష్టంగా 20 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా.

మద్దతు ధరల కన్నా ఎక్కువ..

పత్తికి ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా బహిరంగ మార్కెట్లో అధిక ధర లబిస్తోంది. గత ఏడాది గరిష్టంగా టన్ను రూ 13 వేలు పలికిన ధర ఈ సంవత్సరం రూ 9,500 నుంచి 10,000 వద్ద కొనసాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఇపుడున్న డిమాండ్‌ ను బట్టి పత్తి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. అందువల్లనే ఇపుడున్న ధరకు కొనుగోలు చేసి స్టాకు చేసుకునేందుకు ట్రేడర్లు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కన్నా బహిరంగ మార్కెట్లో రూ 3 వేల కు మించి అధికంగా ధరలు ఉండటంతో రైతులు కూడా ప్రయివేట్‌ ట్రేడర్లకు పత్తిని విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం పొడుగుపింజ రకం పత్తికి టన్నుకు రూ 6,380, మధ్యస్థ పత్తికి రూ 6.080 గా కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల పత్తిని రైతులు మార్కెట్లోనే విక్రయిస్తున్నారు.

- Advertisement -

రంగంలోకి దిగిన సీసీఐ

కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కూడా పత్తి కొనుగోళ్ళకు రంగం సిద్ధం. సీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు మాత్రమే పత్తిని కొనుగోలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో 34 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 34 కేంద్రాలను సీసీఐ ప్రారంభించింది. అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ యార్డు, జిన్నింగ్‌ మిల్లుల్లోనూ సీసీఐ మద్దతు ధరలకు పత్తిని కొనుగోలు చేయనుంది. రాష్ట్రంలో అత్యధికంగా పొడవు పింజ రకాన్నే రైతులు సాగు చేస్తుంటారు. పొడవు పింజ పత్తికి సీసీఐ క్వింటాకు రూ 6,380 చెల్లించనుంది. సీసీఐ ద్వారా పత్తిని అమ్మదల్చుకున్న రైతులు సమీప రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ముందుగా రిజిస్ట్రేష్రన్‌ చేసుకోవాల్సి ఉంటు-ంది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేష్రణ్‌ చేసుకున్న రైతుల పంటను సిసిఐ కొనుగోలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement