Tuesday, May 14, 2024

జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు.. జిల్లాకో గ్యాలరీ, పరిశీలించిన నాగబాబు

అమరావతి, ఆంధ్రప్రభ : ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మార్పు కోసమే రాజకీయాల్లోకి.. బలమైన వ్యవస్థ నిర్మాణమే’ లక్ష్యమని పేర్కొంటూ, 2014 మార్చి 14న ప్రారంభమైన జనసేన పార్టీ ఎనిమిదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసే ప్రసంగాన్ని ఆలకించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభా నిర్వహణ కోసం, ప్రాంగణం కోసం దాదాపు నెల రోజులుగా పరిశీలన చేసి ఇప్పటంలో ఖరారు చేశారు. సభ కోసం అనుమతులివ్వాలంటూ జనసేన నాయకులు దాదాపు పది రోజులు తిరగగా ఎట్టకేలకు పోలీస్‌ శాఖ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడెకరాలలో సభాస్థలిని సిద్ధం చేయడంతోపాటు, సభకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్‌ కోసం 18 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా..
జనసేన ఆవిర్భావ సభకు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సభా వేదికకు వచ్చే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఉండేందుకు మూడు మార్గాలు సిద్ధం చేస్తున్నారు. అలాగే సభా వేదిక ముందు దాదాపు 50 వేల మందిపైగా కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు నాలుగైదు లక్షల మంది వచ్చినా వారందరికీ అల్పాహారం, తాగునీరు, మజ్జిగ అందించేలా వలంటీర్ల వ్యవస్థను నియమించారు. మహిళలకు, వచ్చిన వారందరి కోసం టాయ్‌లెట్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విశాలమైన దారులు సిద్ధం చేశారు. ఎవరికైనా ఏ అస్వస్థత చోటు చేసుకున్నా వెంటనే స్పందించేలా ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, వాటిలో క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలను సిద్ధంగా ఉంచుతున్నారు. సభకు వేర్వేరు జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చే వారందరినీ పట్టించుకునేలా డివిజన్‌, మండల స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, ఎవరి ప్రాంతానికి చెందిన వారిని వారు ఆహ్వానించేలా ఇప్పటికే సూచనలు చేశారు.

జిల్లాకో గ్యాలరీ..
సభకు 13 జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ప్రతి జిల్లాకు ఒక గ్యాలరీ చొప్పున సిద్ధం చేస్తున్నారు. అలాగే పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కూర్చునేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలను జిల్లాల పార్టీ నేతలతోపాటు పవన్‌ కల్యాణ్‌ సూచనలతో నియమించిన 12 బృందాల నేతలు పర్యవేక్షించనున్నారు. సభకు పోలీస్‌ శాఖ నుంచి ఈ నెల ఏడో తేదీన అనుమతులు రావడంతో ఆ రోజు నుంచి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు షరతులతో కూడిన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అధినేత పవన్‌ కల్యాణ్‌, పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పీఏసీ సభ్యులు, పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్య నేతల ప్రసంగాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సభకు రెండు గంటల ముందు, తర్వాత రెండు గంటల వరకు ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ కోసం సమయం కేటాయించారు.

సభ కోసం ప్రత్యేక గీతం, పోస్టర్‌..
‘ఫైట్‌ ఫర్‌ ద రైట్స్‌ ఆఫ్‌ ఈచ్‌ అండ్‌ ఎవ్రీ కామన్‌ పర్సన్‌’ నినాదంతో ఏర్పాటైన జనసేన పార్టీ ఎనిమిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ కోసం జనసైనికులు ప్రత్యేక గీతం, పోస్టర్‌ రూపొందించారు. కోవిడ్‌ ప్రభావం కారణంగా గత రెండేళ్లుగా ఆవిర్భావ సభలు నిర్వహించకపోవడంతో.. ఈ ఏడాది అంచనాలకు మించి పార్టీ శ్రేణులు, అభిమానులు వస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘యువతా మేలుకో.. యుద్ధం మొదలైంది. సైనికుడై, సేవకుడై శిఖరాలు కాదనుకుని వచ్చాడు. నాయకుడై, అర్జునుడై పాదం కదపరా.. గొంతే విప్పరా.. న్యాయం అడగరా.. హక్కే ఉందిరా..’ అనే నినాదాలతో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఇటీవల నాదెండ్ల మనోహర్‌ ఆవిష్కరించారు. అలాగే ‘భవిష్యత్తు జెండాని మోయటం కంటే బాధ్యత ఏముంటుంది. ఒక తరం కోసం యుద్ధం చేయటం కంటే సాహసం ఏముంటుంది’ అనే నినాదంతో పవన్‌ కల్యాణ్‌, జనసైనికులతో కూడిన క్యారికేచర్‌ పోస్టర్‌ను నాదెండ్ల ఆవిష్కరించారు.

సభాస్థలిని సందర్శించిన నాగేంద్రబాబు..
ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ- సభ్యులు, సినీ నటుడు, పవన్‌ కల్యాణ్‌ సోదరుడు కె. నాగేంద్రబాబు, జనసేన నాయకులు పరిశీలించారు. శుక్రవారం రాత్రి నాదెండ్ల మనోహర్‌, ఇతర నాయకులతో కలిసి సందర్శించిన నాగేంద్రబాబు శనివారం మరోసారి సభాస్థలికి చేరుకుని ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అలాగే పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్‌, పంతం నానాజీ, జిల్లాల అధ్యక్షులు, 12 కమిటీల సభ్యులు సభ వద్ద ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

పెరుగుతున్న చేరికలు..
పార్టీ ఆవిర్భావ సభ జరుపుకోవడంతోపాటు, రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతుండటంతో వివిధ పార్టీల నుంచి జనసేనలో చేరుతున్న నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కళ్యాణి గ్రూప్స్‌ అధినేత లోళ్ల రాజేష్‌ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వైసీపీ నుంచి నాయకులు చోడిపిండి సుబ్రహ్మణ్యం, గొలిశెట్టి సూర్యచంద్రరావు, ఆరేటి బులి వెంకట్రామయ్య, కాంగ్రెస్‌ పార్టీ నుంచి అప్పన ప్రసాద్‌, బైపీ పుల్లారావు, ఏపీ -టైలర్స్‌ వర్కర్స్‌ స్టేట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ చెప్పుల మధుబాబుతో పాటు- మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. జిల్లా ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు, పోలవరం ఇంఛార్జి చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకొన్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్‌ అంతా కలసికట్టు-గా పార్టీ బలోపేతానికి, అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement