Thursday, May 2, 2024

Exclusive | ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి గౌరవం.. విజయ్ కుమార్ కు ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డు

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదంచేస్తున్న నేపథ్యంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక డాక్టర్ఎమ్మెస్ స్వామినాథన్ పర్యావరణ పరిరక్షణ అవార్డు దక్కింది. పాతికేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా అత్యున్నత స్థాయిలో సేవలందించే వ్యక్తులు లేదా సంస్థలకు మద్రాస్ ఈస్ట్ రోటరీ క్లబ్ వారు ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.

2023వ సంవత్సరానికి గాను విజయ్ కుమార్ కు ఈ అవార్డు దక్కింది. రోటరీ క్లబ్ ఆఫ్ ఈస్ట్ మద్రాస్ లో గౌరవ సభ్యత్వం కలిగిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ఎమ్మెస్ స్వామినాథన్​ గౌరవార్థం ఏటా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ను ప్రకటిస్తున్నారు.

సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాలపై ఎంతో ప్రభావం చూపుతోన్న ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తోన్న కారణంగా ఇటీవలికాలంలో మారికో అవార్డు, ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు లను అందుకొన్న విజయ కుమార్ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చి చేరింది. సెప్టెంబర్లో జన్మించిన డాక్టర్ స్వామినాథన్ జన్మ మాసాన్ని స్మరించుకొని 2023 సెప్టెంబర్ 6 వ తేదీన మద్రాస్ లో అట్టహాసంగా జరగనున్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో విశేష అతిథుల సమక్షంలో ఈ అవార్డును అందజేస్తారు. అవార్డుకు ఎంపికయ్యారంటూ రోటరీ క్లబ్ ఆఫ్ ఈస్ట్ మద్రాస్ అధ్యక్షుడు బాబు కృష్ణమూర్తి అభినందనలు తెలుపుతూ విజయ్ కుమార్ కు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలసిందిగా ఆహ్వానం పంపించారు.

డాక్టర్ఎమ్మెస్ స్వామినాథన్ కుమార్తె సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. గత ఏడాది “సైంటిఫిక్ కౌన్సిల్ గ్లోబల్ సెంటర్ ఫర్ క్త్లెమేట్ అడాప్టేషన్” ఛైర్మన్ డాక్టర్ రూడీ రాబిన్ గీ ఈ అవార్డు ను సొంతం చేసుకొన్నారు. అంతకు మునుపు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ మాజీ అద్యక్షులు కెన్నెత్ ఎం కిన్, అలయన్స్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఆఫ్రికా బోర్డు మెంబర్ డాక్టర్ మరియా ఈసబెల్ అండ్రెడ్ ఈ అవార్డు అందుకొన్న వారిలో ఉన్నారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన 185 మంది సభ్యత్వం కలిగియుండి ఇంటర్నేషనల్ రోటరీలో భాగమైన  ఈ సంస్థ 38 ఏళ్లుగా సామాజిక అభివృద్ధి, సామాజిక ఆరోగ్యం తదితర రంగాలలో కృషిచేస్తూ అందరూ ఆహ్లాదంగా జీవించే ఆదర్శ సమాజాన్ని, ప్రపంచాన్నినెలకొల్పే లక్ష్యంతో పనిచేస్తోంది.

- Advertisement -

రైతు సాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి ప్రకృతి వ్యవసాయాన్ని చెరవేసి వివిధ రాష్ట్రాలు దేశాలలో కూడా ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అడుగులు వేస్తోంది. వివిధ రాష్ట్రాలు, దేశాలు ప్రకృతి వ్యవసాయం అనుసరించేందుకు ముందుకు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ సలహా మండలిలో  రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ కు ఇదివరకే సభ్యత్వ స్థానం దక్కింది. రైతు సాధికార సంస్థ నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ గా మేఘాలయ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాలతో పాటు నేపాల్, ఇండోనేషియా మరియు శ్రీలంక దేశాలలో కూడా ప్రకృతి వ్యవసాయ బీజం వేసేందుకు మద్దతు అందిస్తోంది. యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వాతావరణ సవాళ్లను అధిగమించడంలో ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని, ప్రస్తుత కాలానికి ప్రకృతికి అనుగుణంగా నడిచే ప్రకృతి వ్యవసాయం అత్యంత అవసరం అని అందరూ గుర్తిస్తుండటంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement