Tuesday, May 7, 2024

రసకందాయంలో ప్రకాశం, నెల్లూరు రాజకీయం …ఆ ఇద్ద‌రికీ ఎంపి సీట్లు ఆఫ‌ర్

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎన్నికల వాతావ రణం వేడెక్కుతున్న వేళ రాజకీయ నేతల పార్టీల మార్పుపై కూడా ప్రచారా లు జోరందుకుంటున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి అసంతృప్తులను క్యాచ్‌ చేసేందు కు అధికార వైకాపా పావులు కదుపు తుంటే.. అంతే వేగంగా అధికార పక్షం వైసీపీ నుండి అసంతృప్తులను టార్గెట్‌ చేస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తూ వల వేస్తోంది. ఎత్తు కు పై ఎత్తుల నడుమ ఏపార్టీ నేతలు ఎప్పుడు పక్క పార్టీ లోకి మారుతారో అన్న దానిపై ఇటు ప్రజలు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈక్రమం లోనే ఇప్పటికే అనేక మంది రాజకీయ నేతలపై ఈ ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలపై జరు గుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇందులో ఒకరు పార్టీ బహిష్కృత నేతకాగా, మరొకరు పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే, దీనిపై నిజానిజాలెలాఉన్నా ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున సాగుతుండటం ఇప్పుడు అధికార పార్టీని ఆలోచింపజేస్తోంది. బహిష్కృత నేత ఎటూ పార్టీలో లేరు కాబట్టి ఆయన తెలుగుదేశంవైపు ఆసక్తి చూపడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ, అధికార పార్టీలో ఉంటూ కీలక పదవిలో ఉన్న నేత ప్రతిపక్షంవైపు చూస్తున్నారన్న వార్త మాత్రం ఇప్పుడు సంచలనంగానే మారింది.

రసవత్తరంగా ప్రకాశం రాజకీయం
ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ కీలక పదవుల్లో ఉన్న బావ, బావమర్దుల మధ్య ఆధిపత్య పోరులో ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లేలా చేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అది నిజమేనన్నట్లు ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే అసంతృప్త నేతగా పార్టీలో గుర్తింపు పొందారు. పార్టీ అధినేత వద్ద రెండు సార్లు పంచాయతీ జరిగినా ఆయన మాత్రం సంతృప్తి పడినట్లు కనిపించడం లేదు. ఈక్రమంలోనే ఆయన పార్టీ మారే అంశంపై పొలిటికల్‌ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆయన ముఖ్య అనుచరులతో టచ్‌లో ఉందని, ఒకటి రెండు సార్లు వారితో తెదేపా అధిష్టానం మాట్లాడిందంటూ చెప్పుకుంటున్నారు. ఈచర్చల ఫలితంగా సదరు నేత ఒంగోలు ఎంపీగానూ, ఆయన కుమారుడు దర్శి ఎమ్మెల్యేగానూ తెలుగుదేశం నుండి పోటీచేసే అవకాశముందని అంటున్నారు. అయితే, జిల్లాలో ఆయన ఆదిపత్యానికి గండికొట్టే వారికి స్వయంగా ఆయన బంధువే సహకరిస్తున్నారని సదరు అసంతృప్తనేత భావనగా ఉందని అంటున్నారు. ఈసారి ఒంగోలు పార్లమెంటు స్థానానికి వైకాపా నుండి సిట్టింగ్‌ ఎంపీ పోటీచేయరని, ఈనేపథ్యంలో ఒంగోలు ఎంపీ స్థానం నుండి అసంతృప్త నేత బంధువు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఆయనపై పోటీచేసి గెలుపొందాలన్నది ఈ అసంతృప్త నేత పట్టుదలని, ఇద్దరి మధ్య ఆదిపత్యపోరే తమకు కలిసొస్తుందని తెదేపా కాచుకుకూర్చుందని అంటున్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుండి ఆయన గెలుపోటములపై తెదేపా ఇప్పటికే ఒక సర్వే చేయించిందని, అందులో ఆయన గెలుపు అవకాశాలు బాగా ఉన్నట్లు వచ్చిందని అంటున్నారు. ఈక్రమంలోనే సదరు అసంతృప్త నేత కుమారుడికి దర్శి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచర వర్గం తెదేపా అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టిందని ప్రచారం జరుగుతోంది. వైకాపాలో వర్గాలు ఉంటే తమ గెలుపు తేలికవుతుందని, ఫలితంగా పార్లమెంటు స్థానం దక్కుతుందన్న భావనతో తెలుగుదేశం ఆయనకు ఒంగోలు పార్లమెంటు స్థానం, ఆయన కుమారుడికి దర్శి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వడానికి కూడా అంగీకరించేందుకు సిద్ధమైందని అంటున్నారు. దీంతో ప్రకాశం రాజకీయం రంజుగా మారింది.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనూ మార్పులు
నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ప్రతిపక్ష తెదేపా ఆచితూచి అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. అత్యంత బలంగా ఉన్న అధికార పార్టీ ఇటీవల ఒక కుదుపునకు గురైన సంగతి తెలిసిందే. ఆపార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించింది. అందులో ఇప్పటికే ఒకరు ఆయన సోదరుడిని తెదేపాలో అధికారికంగా చేర్పించేశారు. ఇంకొకరు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ కుటుంబానికి చెందిన ఆయన కూడా తెదేపా వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన మే 27,28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహించబోతున్న మహానాడులో అధికారికంగా తెదేపా తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఆవెంటనే ఆయనకు నెల్లూరు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టనున్నారని అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న నేత ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని, ఎంపీగా బలమైన అభ్యర్ధి లేరని తెదేపా భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఎంపీగా గెలుపొందడం నల్లేరు మీద నడకలా ఉంటుందని తెదేపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఆయనతో ఇప్పటికే తెదేపా చర్చలు జరిపిందని అంటున్నారు. ఆయన తనకు నెల్లూరు పార్లమెంటు స్థానంతోపాటు తన కుమార్తెకు ఉదయగిరి టిక్కెట్టు ఇవ్వాలన్న ప్రతిపాదన చేస్తున్నారని తెలుస్తోంది.

ఉత్కంఠగా రెండు జిల్లాల రాజకీయాలు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికార వైకాపా ఆధిపత్యానికి ఎలాగైనా గండి కొట్టాలన్న ప్లాన్‌తో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ రెండు జిల్లాల్లో రెండు ఎంపీ స్థానాలు ఆపార్టీలో అసంతృప్త నేతలకు కట్టబెట్టి గెలిపించుకోవడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది. ఒక్కో ఎంపీ స్థానం నుండి ఏడు ఎమ్మెల్యే స్థానాల చొప్పున మొత్తం 14 స్థానాల్లో అధికార వైకాపాకు ముచ్చెమటలు పట్టించాలని తెదేపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే, అధికార వైకాపా కూడా ఇప్పటికే నష్ట నివారణా చర్యలను ప్రారంభించింది. పార్టీ నుండి నేతలెవరు దూరమైనా కేడర్‌ అలానే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంది. ఎటువంటి రాజకీయ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. దీంతో ఈ రెండు జిల్లాల రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement