Thursday, May 2, 2024

ఏపీకి భారీ వర్ష సూచన.. నేడు, రేపు కుంభవృష్టి హెచ్చరికలు

ప్రభ న్యూస్‌ ప్రతినిధి , నెల్లూరు : నేడు , రేపు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక తో జిల్లా ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతోంది.ఈ జిల్లాకు భారీవర్షాలు తుఫానులు కొత్త కాకపోయినప్పటికీ ఈ నెల 10,11 తేదీల్లో ఒక్కో రోజు దాదాపు 200 మిల్లీమీటర్లు అంటే 20 సెంటీ-మీటర్ల వర్షపాతం నమోదు అవుతుందని హెచ్చరికలు వస్తుండటమే అందుకు కారణం.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా ఇప్పటికే జలమయం అయింది.ప్రధాన రిజర్వాయర్లు అయిన సోమశిల ,కండలేరులు ఇప్పటికే పూర్తి స్తాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నాయి.సోమశిల గరిష్ట సామర్ధం78 టీఎంసీలు కాగా ప్రస్తుతం74 టీఎంసీల నీటి నిల్వ ఉంది.దీంతో పై నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు నాలుగుగేట్ల ద్వారా వదిలి వేస్తున్నారు. మరో వైపు జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి.ఇంకొంచెం నీరు చేరితే తెగిపోయే పరిస్థితి ఏర్పడి ఉంది.

నెల్లూరు జిల్లాతో పాటు- పెన్నానది ప్రవహించే ఎగువ జిల్లాలైన అనంతపురం, కడపలో కూడా భారీ వర్ష సూచనలు ఉండటంతో ఎంత వరదనీరు ముంచుకొస్తుందన్నది అంచనాలకు అందటం లేదు. మంగళవారం ఉదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి.జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పరిస్థితులపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement