Tuesday, May 14, 2024

Delhi: కేసుల నుంచి బయటపడేందుకు వచ్చారా?.. సీఎం జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ నేతల ప్రశ్నలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేసుల నుంచి బయటడేందుకు వచ్చారా? లేక కేంద్ర ప్రభుత్వం వద్ద తల వంచేందుకు ఢిల్లీ వచ్చారా అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు జగన్ ఢిల్లీ టూర్‌పై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి హుటాహుటిన ఢిల్లీకి వస్తే రాష్ట్రానికి నిధులు రాబడుతున్నారనుకున్నాం, ప్రాజెక్టుల ఒప్పందానికి సంతకాలు పెడుతున్నారనుకున్నామని రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.

ప్రధానమంత్రిని, విద్యుత్ శాఖ మంత్రిని కలిశాక ఏం మాట్లాడారో మాత్రం చెప్పడం లేదన్నారు. ప్రధానిని అనేకసార్లు కలిసిన జగన్ ఒకటే నివేదిక, ఒకే అంశాలు తప్ప మరేమీ ఉండట్లేదని విమర్శించారు. ఇన్ని విజ్ఞప్తులకు కనీసం ఫైల్ నెంబర్లైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు వెనకబడానికి కారణం వైసీపీయేనని కనకమేడల ఆరోపించారు. జగన్‌ది రివర్స్ గవర్నమెంట్, డిస్ట్రక్షన్ ఆక్టివిటీ అని ఆయన దుయ్యబట్టారు. జలశక్తి శాఖ మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటున్నారని వెల్లడించారు. రాష్టానికి ఆర్ధిక నిధులు లేక, ప్రణాళిక లేక, ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ లేక ఆలస్యమవుతోందని స్వయానా కేంద్రమంత్రే పార్లమెంట్‌లో చెప్పారని ఆయన గుర్తు చేశారు.

గతంలో ప్రధాని కార్యాలయంలో ఇచ్చిన వినతి పత్రాలేంటి? వాటి వివరాలు, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జగన్ చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాములు, కేసుల నుంచి బయట పడేయమని అడగడానికి వచ్చారా అని ప్రశ్నించిన ఎంపీ, ప్రజలకు చెప్పవలసిన అంశాలపై గోపత్య ఎందుకని నిలదీశారు. విద్యుత్ కొనుగోలు ఆపేస్తామని కేంద్రమంత్రి చెప్పారని కనకమేడల తెలిపారు.

ఏపీలో మహిళలకు రక్షణ లేదు : అనిత
ప్రధానితో కలిసి మాట్లాడిన విషయాలు చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని అనిత ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు అసభ్య పనులు చేస్తుంటే వారిని కాపాడటానికి జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఏపీలో లిక్కర్ మాఫియా పాలన సాగుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటే సమాధానం చెప్పలేని స్థితిలో వైఎస్సార్సీపీ నేతలున్నారని ఆమె అన్నారు. డ్రగ్స్ సహా దేశంలో ఎలాంటి చెడ్డ పనులు జరిగినా ఆంధ్రప్రదేశ్ పేరు చర్చకు రావడానికి వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు గోరంట్ల మాధవ్‌ను రక్షించుకోవాలన్న తపనలో కనీసం 10 శాతం కూడా మహిళల రక్షణపై ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement