Monday, April 29, 2024

సమగ్ర భూసర్వేపై జ‌గ‌న్ స‌మీక్ష‌..

అమ‌రావ‌తి – సమగ్ర భూసర్వేలో ఎక్కడా అవినీతికి తావుండకూడదని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా భూసర్వే చేపట్టాలని, ప్రతి చోటా చెకింగ్‌ పక్కాగా ఉండాలని, అలసత్వం చూపొద్దని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ‘వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై జగన్ తన క్యాంప్ కార్యాల‌యంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల ఏరియా రాష్ట్రంలో 17,460 గ్రామాలు. 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్‌)కు సంబంధించిన సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్‌ఓపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు జ‌గ‌న్ దృష్టికి అధికారులు తెచ్చారు. జూలై నాటికి 51 గ్రామాల్లో.. తొలి దశలో ప్రతి జిల్లాలో ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాలు.. ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూర్తయిందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి, జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇంకా 650 గ్రామాలకు గానూ, ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేశామని, ఆ మేరకు ఫొటోలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఫొటోలు తీశామని అధికారులు వివరించారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ, “మొత్తం భూరికార్డులు, డేటాను అప్‌డేట్‌ చేస్తున్నాం కాబట్టి, కేంద్రం నుంచి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి ఆమోదం పొందేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన వారమవుతాము. సర్వే ప్రక్రియకు ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలి. సర్వే తర్వాత అన్నింటికి పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత చెత్తాచెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్‌ క్లియరెన్స్‌ కింద వాటన్నింటినీ తొలగించి, చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతండి. ఆ విధంగా రైతుల ప్రమేయం కూడా ఉండాలి” అని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement