Tuesday, May 14, 2024

లంచం ఇస్తే ప్ర‌భుత్వ భూమీ రిజిస్ట్రేష‌న్ – ఎపిలో భూబ‌కాసురులు

అమరావతి, ఆంధ్రప్రభ, బ్యూరో: కోడి పిల్లలను తిన్న రాబందులను సైతం మింగేసేలా స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో కొంతమంది అవినీతి అధికారులు తయారయ్యారు. అడుగడు గునా చక్రం తిప్పుతూ అవినీతి అక్రమాలకు గేట్లు ఎత్తేసి స్వంత ఖజానాను నింపుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికా రులు శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక విధానాన్ని తెరపైకి తీసుకొస్తు న్నా.. అవినీతి రుచి మరిగిన కొంతమంది అధికారులు మాత్రం తెరవెనుక చక్రం తిప్పుతూనే ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 80 శాతం పైగా సబ్‌ రిజిస్ట్రార్‌, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఒక్క జిల్లా పరిధిలో నెలకు రూ.100 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగు తుంటాయి. అలాగే 200 నుంచి 250కు పైగా రిజిస్ట్రేషన్లు ప్రతి రోజు ఆయా జిల్లాల పరిధిలో జరుగుతున్నాయి.

అయితే వాటి లో దాదాపుగా 90 శాతం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 5 నుంచి 10 శాతం మార్కెట్‌ వ్యాల్యులో కమీషన్‌ల రూపంలో దొడ్డి దారిన అధికారులు వసూలు చేస్తున్నట్లు పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రిజిస్ట్రేషన్‌దారులకు కొన్ని సందర్భాల్లో మార్కెట్‌ వ్యాల్యు కూడా తగ్గించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఆ శాఖను అనునిత్యం వెంటాడేతోనే ఉన్నా యి. గత ఏడాది రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో 10 మందికి పైగా అధికారులను అప్పట్లో సస్పెండ్‌ చేశారు. మరి కొంతమందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మరికొన్ని జిల్లాల పరిధిలో విచారణ జరుగుతూనే ఉంది. అందుకు సంబంధించి వాస్తవాలు బయటకు రాకుండా కొన్ని జిల్లాల పరిధిలో జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు జాగ్రత్త పడ్డారు. దీంతో కొంతమంది అవినీతి అధికారుల బండారం వెలుగులోకి రాలేకపోయింది. అయితే గత కొంతకాలంగా నిబంధనలకు దగ్గరగా విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇటీవల కాలంలో మళ్లిd అవినీతి, అక్రమాలకు తలుపులు తెరిచారు. నిత్యం జరుగుతున్న రిజిస్ట్రేషన్‌లలో 80 శాతం పైగా రిజిస్ట్రేషన్‌లలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అనధికారికంగా నగదు దర్శనమిస్తూనే ఉందంటే ఏ స్థాయిలో కాసుల వేటలో అధికారులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అక్రమాల్లో..చక్రం తిప్పుతున్న ఘనులు
నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో సంచలనంగా మారింది. గతంలో శాఖ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ అక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులు కూడా నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కొరడా రులిపించారు. అయినా సబ్‌ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీల పరిధిలో కొంతమంది చక్రం తిప్పుతూ అందిన వరకు దోచుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ భూములకు కూడా రిజిస్ట్రేషన్‌ చేసి జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా అక్రమాలు వందల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ప్రతీ జిల్లాలోనూ ఏదో ఒక సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం పరిధిలో నెలకు 2 నుంచి 5 వరకు ప్రభుత్వ ఆస్తులనే రిజిస్ట్రేషన్లు చేసి దొంగలతో చేతులు కలుపుతున్న సందర్భాలు ఎక్కువగానే దర్శనమిస్తున్నాయి. వీటిపై ఫిర్యాదులు వెళ్లడం, ఆయా ప్రాంతాలకు చెందిన సబ్‌ రిజిస్టర్‌ తో పాటు కింది స్థాయి అధికారులపై ఉన్నతాధికారులు కఠినంగానే చర్యలు తీసుకుంటున్నారు. అయినా రిజిస్ట్రేషన్‌ శాఖలో పనిచేసే సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రతీ జిల్లాలోనూ కొంతమంది సిబ్బంది చక్రం తిప్పుతూ సొంత ఖజానాను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాల పరిధిలో ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం చూస్తుంటే సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి వారికి కూడా నెల మామూళ్లు అందుతున్నాయన్న సందేహాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

నిత్యం చేతులు మారుతున్న..అక్రమ సంపాదన
సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలో నిత్యం 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆయా కార్యాలయాల పరిధిలో పనిచేసే అధికారులు, క్రింది స్థాయి సిబ్బందికి మామూళ్ల రూపంలో పంచుకుంటున్నారంటే ఆ శాఖ పరిధిలో ఏ స్థాయిలో అక్రమ సంపాదన సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం మార్కెట్‌ ధరను నిర్ధేశిస్తుంది. అందుకు సంబంధించి డాక్యుమెంట్‌ ఛార్జీలను చెల్లిస్తే సరిపోతుంది. అయితే అందుకు పూర్తి భిన్నంగా పలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో అదనంగా 5 నుంచి 10 శాతం మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే ఏదోఒక కారణం చూపుతూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను జాప్యం చేయడం అలవాటుగా మారిపోతుంది. దీంతో కొంతమంది విధిలేని పరిస్థితుల్లో వారు అడిగిన మామూళ్లు ముట్టజెప్పి ప్రభుత్వానికి నిబంధనల మేరకు చెల్లించాల్సిన మొత్తంలో నుంచి దొడ్డి దారిన కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అధికారులు కూడా రాజమార్గంలోనే పచ్చజెండా ఊపేస్తున్నారు. దీంతో వారి అక్రమ సంపాదన ఆశించిన స్థాయి కంటే మరింత పెరుగుతూ వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతుంది. ఏసీబీ అధికారుల దాడుల్లోనూ, తనిఖీల్లోనూ ఎక్కువ శాతం రిజిస్ట్రేషన్‌ సిబ్బందే పట్టుబడుతున్నారంటే ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయిలో ఏ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టం అర్ధమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో కాసుల కోసం నిత్యం వేటను సాగించే అవినీతి సిబ్బంది సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. రాష్ట్ర స్థాయి అధికారులు విచారణను జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement